ఓ వైపు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తెల్ల రేషన్ కార్డుల జారీకి ఏర్పాట్లు చేస్తుంటే మరో పక్క దరఖాస్తుల స్వీకరణ ప్రకీయాలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రజావాణి గ్రామ సభలలో తెల్ల రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులందరికీ కార్డులు ప్రభుత్వం జారీ చేస్తోంది. కానీ ఇంకా అనేక లక్షల మంది తెల్ల రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. వారందరూ మీ-సేవా కేంద్రాలలో దరఖాస్తులు సమర్పిస్తున్నారు.
కానీ గత మూడు రోజులుగా మీ సేవా కేంద్రాల కంప్యూటర్లలో తెల్ల రేషన్ కార్డులకు దరఖాస్తు ఆప్షన్ మాయం అవడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో తెల్ల రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించడం నిలిపివేస్తోందని పుకార్లు మొదలవడంతో, వాటి కోసం భారీ సంఖ్యలో ప్రజలు మీ-సేవా కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు.
కానీ మీ-సేవా కేంద్రం కంప్యూటర్లలో కొత్త తెల్ల రేషన్ కార్డులకు దరఖాస్తు ఆప్షన్ మాయం అవడంతో మీ-సేవా కేంద్రం కేంద్రం నిర్వాహకుల వద్ద బారులు తీరిన ప్రజలు నిలదీస్తుండటంతో వాగ్వాదాలు జరుగుతున్నాయి.
ఈవిషయం పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళడంతో ఈ సమస్యపై చర్చించి మీ-సేవలో తెల్ల రేషన్ కార్డుల దరఖాస్తు స్వీకరించాలని నిర్ణయించారు. వారి ఆదేశం మేరకు మీ-సేవా అధికారులు సోమవారం సాయంత్రం నుంచి మళ్ళీ మీ-సేవా కంప్యూటర్లలో తెల్ల రేషన్ కార్డుల దరఖాస్తు ఆప్షన్ పునరుద్దరించారు.
కనుక కొత్తగా తెల్ల రేషన్ కార్డులకు మీ-సేవలో దరఖాస్తు సమర్పించవచ్చు. ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించినవారికి తెల్ల రేషన్ కార్డులు జారీకి ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. కనుక వారు మళ్ళీ మీ-సేవలో దరఖాస్తులు సమర్పించనవసరం లేదు.