ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో బీజాపూర్ అడవులలో భద్రతాదళాలు చేపట్టిన ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులు హతం అయ్యారు. భారీగా ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒకేసారి 31 మందిని మట్టుపెట్టడంతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. వామపక్ష పార్టీలు ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి. అయితే కేంద్రం హోంమంత్రి అమిత్ షా ఈ దాడిని గట్టిగా సమర్ధించుకున్నారు.
వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిస్టులు అందరినీ ఏరివేసి దేశానికి ముఖ్యంగా మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్న పేద ప్రజలకు విముక్తి కల్పిస్తామని చెప్పారు. నక్సల్ రహిత సమాజం ఏర్పాటులో భద్రత దళాలు పెద్ద విజయం సాధించాయంటూ వారిని అభినందిస్తూ అమిత్ షా ట్వీట్ చేశారు.
మావోయిస్టుల చేతిలో ఏ ఒక్క పౌరుడు ప్రాణం కోల్పోకూడదు. మావోయిస్టుల వలన ఏ రాష్ట్రానికి నష్టం కాలగకూడదనేదే తమ ఆశయం అని అన్నారు. దేశంలో మావోయిస్టులందరినీ పూర్తిగా ఏరివేసే వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంటుందని అమిత్ షా అన్నారు.
మావోయిస్టులు, భద్రత దళాలకు మద్య జరిగిన ఎదురు కాల్పులలో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. వారిని రాయపూర్‌కి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు.