ఈ నెల 9 నుంచి సమ్మెకు సిద్దమవుతున్న టిజిఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను చర్చలకు రావాలని కార్మికశాఖ ఆహ్వానించింది. సోమవారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లోని లేబర్ కమీషనర్ కార్యాలయంలో తమ సమక్షంలో ఆర్టీసీ యాజమాన్యంతో సమావేశం నిర్వహించి సమస్యలపై చర్చిద్దామని కార్మికశాఖ తెలియజేసింది. చర్చలకు కూర్చోబోతున్నాము కనుక సమ్మెకు తొందరపడవద్దని లేబర్ కమీషనర్ ఆర్టీసీ జెఏసీ నేతలకు విజ్ఞప్తి చేశారు.
ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసుపై టిజిఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా స్పందించారు. “టిజిఎస్ ఆర్టీసీపై డీజిల్ భారం తగ్గించుకొని, ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించాలనే సదుదేశ్యంతోనే ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడుతున్నాము తప్ప ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని కాదు.
ఎలక్ట్రిక్ బస్సులన్నీ టిజిఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలోనే నడుస్తాయి. వాటి కారణంగా ఆర్టీసీలో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించబోము. అదనంగా మరో 3038 మందిని నియమించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. కనుక ఎలక్ట్రిక్ బస్సుల గురించి అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దు,” అని ఆర్టీసీ కార్మికులకు సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.