ఆ తొక్కిసలాటకు అల్లు అర్జునే కారణం: రేవంత్

January 23, 2025


img

ప్రస్తుతం దావోస్‌ సదస్సులో పాల్గొంటున్న సిఎం రేవంత్ రెడ్డిని అక్కడ ఓ జాతీయ మీడియా సంస్థ ప్రతినిధి “సంధ్య థియేటర్‌ ఘటనకి ఎవరు బాధ్యులని మీరు భావిస్తున్నారు?” అని ప్రశ్నించారు. 

దానికి సమాధానంగా, “ఆనాడు పుష్ప-2 సినిమా విడుదలవుతున్నప్పుడు, అల్లు అర్జున్‌ సంధ్య థియేటర్‌కి వచ్చేందుకు అనుమతి కోరుతూ పోలీసులకు లేఖ వ్రాశారు. కానీ వారు నిరాకరించారు. అయినా ఆయన థియేటర్‌ వద్దకు ఊరేగింపుగా వచ్చారు. అప్పుడు ఆయనకు దారి కల్పించేందుకు బౌన్సర్లు అభిమానులను పక్కకు నెట్టేయడంతో ఆ ప్రాంతంలో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు నేటికీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. కనుక ఈ ఘటనలకు అల్లు అర్జున్‌ బాధ్యుడు కారని ఎలా అనుకోగలము?

తన సినిమా చూసేందుకు వచ్చిన ఓ మహిళ చనిపోతే ఆయన పట్టించుకోలేదు. ఆమె కుమారుడు శ్రీతేజ్‌ హాస్పిటలో మృత్యువుతో పోరాడుతుంటే ఎవరూ వెళ్ళి పరామర్శించాలనుకోలేదు. అయితే ఈ వ్యవహారంలో నేను ముఖ్యమంత్రిగా ఏం చేయాలో అది మాత్రమే చేశాను. ఈ కేసులో పోలీసులు తన పని తాము చేసుకుపోతారు. దానిలో నాకు వ్యక్తిగత ఆసక్తి ఏమీ లేదు,” అని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు.      



Related Post