తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పధకాలు అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, కొత్త రేషన్ కార్డులకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారి నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహిస్తోంది. జనవరి 24 వరకు ప్రతీరోజూ గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
జీహెచ్ఎంసీ పరిధిలో లబ్ధిదారులను గుర్తించేందుకు నిర్వహిస్తున్న సర్వే ఇంకా పూర్తికాకపోవడంతో ఈ నెలాఖరులోగా సర్వే పూర్తి చేసి ఫిబ్రవరి 1 నుంచి వార్డు సభలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
కొన్ని జిల్లాలలో కాంగ్రెస్ నేతలు తమ అనుచరులకే ఈ పధకాలు ఇప్పించుకుంటున్నారని, లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయంటూ కొన్ని చోట్ల గ్రామసభలలో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహంతో అధికారులతో వాగ్వాదాలకు దిగుతున్నారు. దీంతో అక్కడక్కడ గ్రామసభలు ఉద్రిక్తంగా సాగుతున్నాయి. కనుక గ్రామ సభల వద్ద భారీగా పోలీసులను మోహరించవలసి వస్తోంది.