లొట్టిపీసు కేసు విచారణకు బయలుదేరిన కేటీఆర్‌

January 09, 2025


img

ఎఫ్-1 రేసింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కేటీఆర్‌ కొద్దిసేపటి క్రితం నందినగర్‌లో తన నివాసం నుంచి ఏసీబీ కార్యాలయానికి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రజలను ఉద్దేశయించి సోషల్ మీడియాలో ఓ సందేశం పెట్టారు. 

హైదరాబాద్‌ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు తాను ఎంతగానో కృషి చేశానని దానిలో భాగంగా ఎఫ్-1 రేసింగ్ నిర్వహింపజేశానని కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ కక్షతో ఈ అక్రమ కేసు నమోదు చేసిందని దానిలో పేర్కొన్నారు. 

“తెలంగాణ మొబిలిటీ వ్యాలీలో ఎలక్ట్రానిక్ వాహనాల ఇన్నోవేషన్, రీసెర్చ్ మరియు తయారీ రంగాల్లో పెట్టుబడులు తెచ్చి ఉద్యోగ, ఉపాధి కల్పించాలన్న లక్ష్యంగా పని చేశాము. ఫార్ములా - ఈ సందర్భంగా నిర్వహించిన ఈ - మొబిలిటీ వీక్ ద్వారా 12 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించగలిగాము. 

నీచమైన రాజకీయాలు చేసే చిన్న మనస్తత్వం కలిగిన నాయకులకు ఈ అంశం అర్థం కాలేదు. కానీ విజ్ఞులైన తెలంగాణ ప్రజలకు ఈ అంశం తెలుసు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ విజన్ ను, నిజాన్ని తెలంగాణ ప్రజలు తప్పకుండా గుర్తిస్తారు. ఎప్పటికైనా సత్యం, న్యాయమే గెలుస్తుంది,” అని ట్వీట్ చేస్తూ #లొట్టపీసుకేసు అని జోడించారు.      

ఈ కేసులో అవినీతి జరిగిందని ప్రాధమిక సాక్ష్యాధారాలున్నాయని, కనుక దర్యాప్తు జరిపి నిజానిజాలు తేల్చాల్సిన అవసరం ఉందని హైకోర్టు స్పష్టంగా పేర్కొంది. అయినప్పటికీ కేటీఆర్‌ ఇదో ‘లొట్టిపీసుకేసు’ అని చెపుతూ తనని అన్యాయంగా కేసులో ఇరికించారని వాదిస్తున్నారు. ఈ ‘లొట్టిపీసుకేసు’ నుంచే తనకి విముక్తి కల్పించమని హైకోర్టు, సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతున్నారు కదా? 


Related Post