హైకోర్టు, సుప్రీంకోర్టులో కేటీఆర్‌ పిటిషన్స్.. ఏమవుతుందో?

January 08, 2025


img

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఎఫ్‌1 రేసింగ్ కేసులో ఈ నెల 9న విచారణకు హాజరు కావాలని ఏసీబీ మళ్ళీ నోటీస్ పంపించడంతో ఆయన ఈరోజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ వేశారు. 

విచారణ పేరుతో తాను చెప్పని విషయాలు చెప్పిన్నట్లు ఏసీబీ రికార్డులలో నమోదు చేస్తుందని, కనుక ఈ కేసు విచారణలో తనతో పాటు న్యాయవాదిని కూడా అనుమతించాలని ఏసీబీని ఆదేశించవలసిందిగా కేటీఆర్‌ హైకోర్టుని అభ్యర్ధించారు. కేటీఆర్‌ పిటిషన్‌ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. 

హైకోర్టు నిన్న కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌ కొట్టివేసి బెయిల్‌ పొడిగించేందుకు నిరాకరించడంతో ఆయన తరపు న్యాయవాదులు వెంటనే నిన్న సాయంత్రమే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ వేశారు. 

ఈ కేసులో ఏ-1 నిందితుగా ఉన్న కేటీఆర్‌ ప్రజాప్రతినిధిగా, మాజీ మంత్రిగా పనిచేశారు. ఆ హోదాలో ఆయన ఎటువంటి అవినీతికి పాల్పడలేదు. తాను లబ్ధి పొందలేదు. ఎవరికీ లబ్ధి కలిగించలేదు. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో కూడా ఆయన నేరం చేసిన్నట్లు ఎటువంటి సాక్ష్యాధారాలు చూపలేదు. కనుక ఎఫ్‌ఐఆర్‌ కొట్టివేయవలసిందిగా కోరుతూ కేటీఆర్‌ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుని అభ్యర్ధించారు.  

మరో పక్క తెలంగాణ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో వెంటనే కేవీయట్ పిటిషన్‌ వేసింది. ఈ కేసులో ఎటువంటి ఉత్తర్వులు జారీ చేసే ముందు తమ వాదనలు కూడా విని పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టుని కోరింది. 

ఒకవేళ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు తక్షణమే ఆయన పిటిషన్లపై సానుకూలంగా స్పందిస్తే పర్వాలేదు లేకుంటే రేపు విచారణకు హాజరైనప్పుడు ఏసీబీ ఆయనని అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. కనుక బిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి  పార్టీ నేతలు, కార్యకర్తలు చేరుకుంటున్నారు.    



Related Post