రైతు హీర్యా నాయక్‌కు బేడీలు.. జైలర్ సస్పెండ్

December 13, 2024


img

లగచర్ల దాడి కేసులో అరెస్టయ్యి పరిగి జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న రైతు హీర్యా నాయక్‌కి చేతికి బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకువెళ్ళడం, ఆస్పత్రిలో మంచానికి గొలుసుతో బందించి ఉండచడంపై మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. వాటిని చూపుతూ బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోంది. రైతుకు బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకువెళ్ళడంపై సిఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించారు. 

సిఎం ఆదేశం మేరకు మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ సంగారెడ్డికి వెళ్ళి విచారణ జరిపినప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. 

ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త సురేష్, జైలులోని లాండ్ లైన్ ఫోన్ నుంచి ఎవరితోనో మాట్లాడిన్నట్లు కనుగొన్నారు. బహుశః అతనే బిఆర్ఎస్ నేతలకి హీర్యా నాయక్ విషయం చేరవేయగా, వారు మీడియాకి సమాచారం అందించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. 

హీర్యా నాయక్‌కు గుండెపోటు రాలేదని ఛాతిలో నొప్పిగా ఉందని చెపితే జైలు సిబ్బంది బుధవారం ఆయనని సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్ళి వైద్య పరీక్షలు చేయించారని, అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్య లేదని వైద్యులు చెప్పారని ఐజీ సత్యనారాయణ చెప్పారు. 

మళ్ళీ గురువారం ఉదయం హీర్యా నాయక్ ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పడంతో జైలు సిబ్బంది మరోసారి ఆస్పత్రికి తీసుకువెళ్ళారని చెప్పారు. వైద్యుల సూచన మేరకు అతనిని హైదరాబాద్‌ నీమ్స్ హాస్పిటల్‌కు తరలించామని ఐజీ సత్యనారాయణ చెప్పారు.    

గుండెపోటు వచ్చిన్నట్లు చెపితే త్వరగా బెయిల్ లభిస్తుందని సురేష్ అతనికి సలహా ఇచ్చిన్నట్లు తెలిసిందని ఐజీ సత్యనారాయణ మీడియాకు చెప్పారు.

హీర్యా నాయక్‌పై వికారాబాద్‌లో కేసు నమోదు కాగా సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో బాలానగర్ పోలీస్ స్టేషన్‌లో  కేసు నమోదైన్నట్లు చూపిన విషయం బయటపడింది. బాలానగర్‌లో రోడ్ యాక్సిడెంట్ కేస్ 153/2024లో అరెస్ట్ అయిన హీర్యా నాయక్‌ని అరెస్ట్ చేసిననట్లు ట్రాన్సిస్ట్ లేఖలో చూపిన విషయం విచారణలో బయటపడింది. వీటన్నిటినీ పరిశీలించినప్పుడు హీర్యా నాయక్‌ వ్యవహారంలో ఏదో రాజకీయ కుట్ర జరిగిననట్లు అనుమానం కలుగుతోంది.               

ఐజీ సత్యనారాయణ సిఫార్సు మేరకు జైలర్ సంజీవ రెడ్డిని సస్పెండ్ చేస్తూ జైళ్ళ శాఖ డీజీ సౌమ్యా మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. జైలు సూపరిండెంట్‌ సంతోష్ రాయ్‌పై శాఖా పరమైన విచారణకు ఆదేశించారు. అయితే రైతులను కోర్టుకి, జైలుకి తరలిస్తున్నప్పుడు వారి చేతులకు బేడీలు వేసి గొలుసులతో బందించి తీసుకువెళుతుండటంపై ప్రభుత్వం ఇంకా సంజాయిషీ ఈయవలసి ఉంది.


Related Post