కేసీఆర్‌ ఇంట్లో మంత్రి పొన్నం భోజనం!

December 08, 2024


img

మంత్రి పొన్నం ప్రభాకర్‌, కలెక్టర్ అనుదీప్, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్, ప్రోటోకాల్ విభాగానికి చెందిన వెంకట రావు కలిసి శనివారం మద్యాహ్నం 1.30 గంటలకు ఎర్రవల్లిలోని కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు వెళ్ళారు. 

సోమవారం సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించారు. కేసీఆర్‌ వారికి మొహం చాటే స్తారని అందరూ భావించారు. కానీ కేసీఆర్‌ వారిని సాదరంగా ఆహ్వానించడమే కాకుండా భోజనానికి కూడా ఆహ్వానించి వారితో కలిసి భోజనం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆయనకు ఆహ్వాన పత్రిక అందించి రేపు జరుగబోయే కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానించారు. 

అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్‌ మీడియాతో మాట్లాడుతూ, “ప్రభుత్వం తరపున మేము అందరినీ ఆహ్వానిస్తున్నాము. కేసీఆర్‌ని కూడా మర్యాదపూర్వకంగా ఆహ్వానించాము. మేము భోజన సమయానికి వెళ్లినందున ఆయన మమ్మల్ని భోజనానికి ఆహ్వానించగా ఆయనతో కలిసి భోజనం చేశాము. 

తెలంగాణ తల్లి విగ్రహం రూపు రేఖలు, శాసనసభ సమావేశాలు, రాజకీయాల గురించి గానీ  మేము మాట్లాడుకోలేదు. ఇది ప్రోటోకాల్ ప్రకారం మర్యాదపూర్వకంగా జరిగిన భేటీ మాత్రమే. మా బాధ్యతగా మేము ఇంటికి వెళ్ళి ఆహ్వానించాము. ఆయన రేపటి కార్యక్రమానికి, శాసనసభ సమావేశాలకు వస్తారా లేదా అనేది ఆయనిష్టం,” అని చెప్పారు. 

అంతకు ముందు వారందరూ కలిసి రాజ్ భవన్‌కు వెళ్ళి గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మని కలిసి ఆహ్వానించారు. ఆ తర్వాత దిల్ కుశ  అతిధి గృహంలో ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి ఆహ్వానపత్రిక అందజేసి ఆహ్వానించారు.


Related Post