తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు చేపని పట్టుకోవడానికి వల వేస్తే పెద్ద తిమింగలం వలలో చిక్కింది. ఆ చేప నీటిపారుదల శాఖలో ఏఈఈగా చేస్తున్న కార్తీక్. ఆ చేప కోసం వచ్చి వలలో చిక్కిన తిమింగలం గండిపేట ఏఈఈ నిఖేశ్ కుమార్.
గండిపేట పరిధిలో నెక్నాంపూర్‌కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఓ అపార్ట్‌మెంట్ నిర్మాణం కోసం ఎన్‌ఓసీకి దరఖాస్తు చేసుకోగా ఏఈఈ కార్తీక్ రూ.2.50 లక్షలు లంచం అడిగారు. ఈ వేధింపులు భరించలేక సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏసీబీని ఆశ్రయించారు.
ఈ విషయం తెలియని ఏఈఈ కార్తీక్ ఆ సొమ్ము తీసుకొని తన కార్యాలయానికి వస్తే ఎన్‌ఓసీ ఇస్తానని చెప్పారు. ఏసీబీ అధికారులు వలపన్ని అతను లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.
ఇక్కడే గమ్మత్తు జరిగింది. ఆ లంచంలో తన వాటా తీసుకునేందుకు గండిపేట ఏఈఈ నిఖేశ్ కుమార్ అక్కడికి వచ్చి ఏసీబీ వలలో చిక్కుకున్నారు.
నిఖేశ్ కుమార్ ఇదివరకు కూడా ఓసారి లంచం తీసుకుంటూ పట్టుబడి ఉద్యోగంలో నుంచి సస్పెండ్ అయ్యారు. కనుక అవినీతి నిరోధకకి అధికారులు శనివారం ఉదయం పీరంచెరువు పెబెల్ గేటెడ్ కమ్యూనిటీలోని అతని నివాసంలో సోదాలు నిర్వహించారు.
అదే సమయంలో మరో 19 బృందాలు మొయినాబాద్ మండలంలోని తోల్కట్ట, సజ్జనపల్లి, నక్కలపల్లి ఫామ్‌హౌస్‌లతో బాటు అతని బంధుమిత్రుల ఇళ్ళలో కూడా సోదాలు చేసహి విలువైన ఆస్తి పత్రాలు వగైరా స్వాధీనం చేసుకున్నారు.
వాటి ప్రకారం నిఖేశ్ కుమార్ ఆస్తుల విలువ రూ.17.74 కోట్లు కాగా, బహిరంగ మార్కెట్‌లో వాటి విలువ సుమారు వంద కోట్లు పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు తెలిపారు.
ఏఈఈగా నిఖేశ్ కుమార్ నెలకు జీతం సుమారు రూ.2 లక్షలు పొందుతుంటే, అతని రోజువారీ ఆదాయమే రెండు లక్షలకు మించి ఉండేది. అందువల్లే వంద కోట్లు ఆస్తులు పోగేయగలిగారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సామాన్య ప్రజల కష్టాలు తీరుతాయనుకుంటే ఈవిదంగా కొంతమంది ఆవినీతిపరులు ప్రజలను దోచుకుతింటూ వందల కోట్లు ఆస్తులు పోగేసుకోవడం చాలా బాధాకరమే కదా?