టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయన నియామక దస్త్రంపై శనివారం సంతకం చేశారు.
ప్రస్తుతం టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా చేస్తున్న మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పదవీ కాలం డిసెంబర్ 2తో ముగియనుంది. కనుక ఆయన స్థానంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న బుర్రా వెంకటేశంని ప్రభుత్వం నియమించింది. ఆయన ఈరోజు సాయంత్రం లేదా సోమవారం ఉదయం బాధ్యతలు చేపట్టనున్నారు.
ఐఏఎస్ అధికారిగా బుర్రా వెంకటేశం పదవీ కాలం ముగియడానికి మరో మూడున్నరేళ్ళు సమయం ఉంది. కనుక అంతవరకు ఆయనే ఛైర్మన్‌గా కొనసాగే అవకాశం ఉంటుంది.
బుర్రా వెంకటేశం జనగామ జిల్లా ఓబుల్ కేశవాపురం గ్రామానికి చెందినవారు. నిరుపేద కుటుంబంలో జన్మించి గురుకుల పాఠశాలలో చదువుకుని ఈ స్థాయికి ఎదిగారు. 1995 బ్యాచ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి.
2005 నుంచి మూడు సంవత్సరాలు మెదక్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. రాష్ట్ర పునర్విభజన కమిటీలో సభ్యుడుగా చాలా కీలకపాత్ర నిర్వహించి విభజన వలన తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి నష్టం కలుగకుండా చేశారు. విద్యాశాఖ కార్యదర్శిగా మంచి సమర్దుడైన అధికారిగా పేరు సంపాదించుకున్న బుర్రా వెంకటేశంని కీలకమైన ఈ పదవికి ప్రభుత్వం ఎంపిక చేయడం చాలా సరైన నిర్ణయమే.