కుమురుం భీం జిల్లాలో దారుణ ఘటన జరిగింది. పొలంలో పని చేస్తున్న మోర్లె లక్ష్మి (21) అనే ఓ మహిళా రైతుకూలిపై పెద్దపులి దాడి చేసి ఈడ్చుకుపోయింది. ఆమెతో పాటు అక్కడే పనిచేస్తున్న మిగిలిన ఉన్న రైతు కూలీలు గట్టిగా కేకలు వేయడంతో పులి ఆమెను వదిలేసి పారిపోయింది. కానీ పులి ఆమెపై దాడి చేసి గొంతు దగ్గర పట్టుకొని ఈడ్చుకు వెళ్ళడంతో కొన ఊపిరితో ఉన్న ఆమెను సమీపంలో ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకువెళుతుండగా దారిలో చనిపోయింది.
గ్రామస్తులు తెలిపిన సమాచారం ప్రకారం కాగజ్ నగర్ గన్నారం గ్రామానికి చెందిన మోర్లె లక్ష్మికి ఏడాది క్రితమే అదే గ్రామానికి చెందిన వాసుదేవ్ అనే యువకుడితో పెళ్ళయింది. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం మరో ఆరుగురు మహిళా రైతు కూలీలతో కలిసి నజ్రూల్ నగర్ గ్రామ శివారులో గల పత్తి పొలంలో పత్తి ఏరుతుండగా, హటాత్తుగా పులి ఆమెపై దాడి చేసి లాక్కుపోయింది.
గ్రామంలో పులి తిరుగుతోందని గుర్తించి ముందు రోజు సాయంత్రమే తాము అటవీశాఖ సిబ్బందికి తెలియజేశామని, కానీ వారు వెంటనే స్పందించకపోవడం వల్లనే మోర్లె లక్ష్మి పులి నోట చిక్కి ప్రాణాలు కోల్పోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామస్తులు లక్ష్మి మృతదేహంతో కాగజ్ నగర్‌లోని అటవీశాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేసి నిరసనలు తెలిపారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, సీఎఫ్ శాంతారాం అక్కడకు చేరుకొని వారితో మాట్లాడి శాంతింపజేశారు.
ఆమె కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం, 5 ఎకరాలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. కానీ అటవీశాఖ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మోర్లె లక్ష్మి ఇంకా జీవితం ఆరంభించక మునుపే 21 ఏళ్ళకే అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయింది కదా?