వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసం 632 ఎకరాల భూసేకరణకు జారీ చేసిన నోటిఫికేషన్‌ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూసేకరణపై స్థానిక రైతులు, గ్రామస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవడం, ప్రతిపక్షాలు విమర్శలతో రాష్ట్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు.
జిల్లా కలెక్టర్ తదితరులపై గ్రామస్తులు దాడి చేసిన ఘటనలో మాజీ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, స్థానిక కార్యకర్త సురేష్, అతని సోదారుడుతో సహా పలువురు గ్రామస్తులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు పరస్పరం తీవ్ర విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవడంతో ఇది రాజకీయ సమస్యగా మారింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం విజ్ఞత ప్రదర్శించి భూసేకరణ నోటీస్ ఉపసంహరించుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని లగచర్ల గ్రామస్తులు, రైతులు స్వాగతించారు.
నిర్మల్ జిల్లా దిలావర్ పూర్‌లో నిర్మాణంలో ఉన్న ఇథనాల్ ప్లాంట్‌ని వ్యతిరేకిస్తూ అక్కడి గ్రామస్తులు రోడ్లపై బైటాయించి, స్వచ్చదంగా దుకాణాలు మూసివేసి ఆందోళనలు చేపట్టడంతో ఆ ప్లాంట్ అనుమతులు కూడా ప్రభుత్వం రద్ధు చేసి ప్లాంట్‌ని అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించాలని నిర్ణయించింది.