పరిశ్రమలు, ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేసినప్పుడు ఎక్కువగా బలయ్యేది సామాన్య రైతులే. అయితే కేసీఆర్ హయాంలో వారి ఆందోళనలు బయటకు వినిపించేవి కనిపించేవి కావు. అంతగా కట్టడి చేసి భూసేకరణ చేసేవారు. ఇప్పుడు కూడా రాష్ట్రంలో భూసేకరణలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రజలు ధైర్యంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేయగలుగుతున్నారు.
సిఎం రేవంత్ రెడ్డి స్వంత జిల్లా వికారాబాద్‌లో లగచర్లలో గ్రామస్తుల నిరసనలు, తాజాగా నిర్మల్ జిల్లాలో దిలావర్ పూర్ గ్రామ ప్రజలు చేసిన నిరసనలు ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఇదివరకు కేసీఆర్ ప్రభుత్వం భూసేకరణ మొదలుపెడితే ఎట్టి పరిస్థితులలో వెనక్కు తగ్గేది కాదు. కానీ ఈవిషయంలో అవసరమైతే కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కు తగ్గుతోంది.
దిలావర్ పూర్-గుండం పెల్లి మద్య ఇథనాల్ ప్లాంట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఆ చుట్టు పక్కల గ్రామాల ప్రజలు గత కొన్ని రోజులుగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా వారు పోలీసులపై రాళ్ళతో దాడులు కూడా చేశారు.
లగచర్ల భూసేకరణ విషయంలో దూకుడుగా వ్యవహరించి ప్రభుత్వం విమర్శల పాలైంది కనుక దిలావర్ పూర్ ఇథనాల్ ప్లాంట్ విషయంలో వెనక్కు తగ్గాలని నిర్ణయించింది. నిర్మాణంలో ఉన్న ఇథనాల్ ప్లాంట్ పనులు నిలిపివేసి దాని అనుమతులు రద్దు చేశామని మంత్రి సీతక్క స్వయంగా ఆందోళనకారులకు ఫోన్ ద్వారా తెలియజేశారు.
ఆమె అభ్యర్ధన మేరకు వారు ఆందోళన విరమించడంతో నేడు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి వారితో కలెక్టర్ కార్యాలయంలో భేటీ అయ్యారు.
ఇథనాల్ పరిశ్రమని అక్కడి నుంచి తరలించాలని, ఆందోళనకారులపై కేసులు ఎత్తివేయాలని, వారికి మద్దతు ఇచ్చిన ప్రభుత్వోద్యోగులపై విధించిన సస్పెన్షన్ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేయగా జిల్లా కలెక్టర్, ఎస్పీ సానుకూలంగా స్పందించారు.