ప్రస్తుతం సినీ నటులు పోసాని కృష్ణ మురళి, దర్శకుడు రాంగోపాల వర్మ, సినీ నటి శ్రీరెడ్డి తదితరులపై ఏపీలో పోలీసులు కేసులు నమోదు చేశారు. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారు ముగ్గురూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, వారి ఇంట్లో ఆడవాళ్ళని ఉద్దేశించి చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేసేవారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టేవారని వారిపై కేసులు నమోదయ్యాయి.
తాజాగా ప్రముఖ సినీ హాస్య నటుడు అలీ మీద కూడా కేసు నమోదైంది. అయితే ఈ కేసు అటువంటిది కాదు. ఆయన ఫామ్ హౌస్ నిర్మాణ అనుమతులకు సంబందించినది.
ఆయన వికారాబాద్ జిల్లా, నవాబుపేట మండలం, ఏక్ మామిడి గ్రామ పంచాయితీ పరిధిలో ఫామ్ హౌస్ నిర్మించుకుంటున్నారు. కానీ దానికి అనుమతులు తీసుకోలేదు. కనుక గ్రామ పంచాయితీ తరపున కార్యదర్శి శోభారాణి నవంబర్ 5న ఆయనకు నోటీస్ పంపారు.
కానీ అలీ స్పందించకుండా ఫామ్ హౌస్ నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. కనుక మళ్ళీ ఈనెల 22న మరోసారి అలీకి నోటీస్ పంపించారు. ఈసారి స్పందించకుంటే ఫామ్ హౌస్‌ని అక్రమ కట్టడంగా పరిగణించి చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నోటీసుకు అలీ తన లాయర్ ద్వారా సమాధానం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.