బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇంతకాలం రాజకీయాలకు దూరంగా మౌనంగా ఉండిపోయారు. ఇటీవల అదానీపై అమెరికా కోర్టులో కేసు నమోదైనప్పుడు తొలిసారిగా “మోడీజీ! అదానీకో న్యాయం ఆడబిడ్డ కో న్యాయమా? అంటూ ట్వీట్ చేశారు. మళ్ళీ ఇవాళ్ళ మీడియా ముందుకు వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో పాఠశాలలని పట్టించుకోవడం మానేసిందంటూ విమర్శలు గుప్పించారు.
“ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు ప్రతీ ప్రభుత్వం పాఠశాల, గురుకుల పాఠశాలలో పిల్లలు చనిపోతూనే ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకు 42 మంది పిల్లలు చనిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే పాఠశాలల పరిస్థితి ఇంత దయనీయంగా మారింది.
ఇదివరకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాఠశాలలు ఎంత చక్కగా ఉండేవి.. పిల్లలు తాము పెద్దయ్యాక ఐఐటీ, ఐఐఎంలలో ఉన్నత చదువులు చదువు కుంటామని చెప్పేవారు. అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు చదువులు పూర్తి చేసుకొని ప్రాణాలతో బయటపడ గలిగితే అంతే చాలు అనుకునే దుస్థితికి చేరుకున్నారు విద్యార్ధులు.
దీనికి ఎవరు కారణం? ప్రభుత్వం కాదా? ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఇప్పటి వరకు 42 మంది పిల్లలు చనిపోయారు. ఇకనైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేల్కొని పాఠశాలల పరిస్థితిపై దృష్టి పెట్టాలని కోరుతున్నాను. చనిపోయిన విద్యార్ధుల ప్రాణాలు ఎవరూ తిరిగి తీసుకురాలేరు. కనీసం ఆ పిల్లల తల్లితండ్రులకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను,” అని కల్వకుంట్ల కవిత అన్నారు.