పాడి కౌశిక్ రెడ్డి ధర్నా... అరెస్ట్!

November 09, 2024


img

హుజూరాబాద్‌ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దళితబంధు రెండో విడత నిధులు విడుదల చేయాలంటూ నేడు పాడి కౌశిక్ రెడ్డి తన అనుచరులతో కలిసి హుజూరాబాద్‌ చౌరస్తాలో ధర్నా చేశారు.

పోలీసులు ఆయనని అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్‌ తరలించేందుకు ప్రయత్నిస్తుండగా ఆయన, అనుచరులు వారితో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా వారికీ, పోలీసులకు మద్య తోపులాట జరగడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిని బలవంతంగా పోలీస్ కారులో ఎక్కించేందుకు ప్రయత్నించగా ఆయన ఎదురు తిరిగారు. పోలీసులు అతికష్టం మీద ఆయనని కారులో కూర్చోబెట్టి స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ తోపులాటలో ఆయన కాస్త నీరసించిపోవడంతో వైద్యులు ఆయనకు ప్రధమ చికిత్స చేశారు. 

దళితులకు దళితబంధు సొమ్ము చెల్లించమని అడిగితే పోలీసులు తనతో దౌర్జన్యంగా వ్యవహరించారని పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. తనను పోలీసులు కొట్టినా తిట్టినా, చివరికి చంపినా భయపడబోనని, దళితుల కోసం పోరాడుతూనే ఉంటానన్నారు.

తమ ఎమ్మెల్యేపై పోలీసులు దౌర్జన్యం చేయడాన్ని హరీష్ రావు ఖండించారు. సిఎం రేవంత్‌ రెడ్డి ఆదేశం మేరకే పోలీసులు పాడి కౌశిక్ రెడ్డితో ఆవిదంగా దురుసుగా ప్రవర్తించారని హరీష్ రావు ఆరోపించారు. దళితబంధు నిధులు విడుదల చేయకపోగా అడిగిన వారిని పోలీసులచేత దాడి చేయిస్తారా? అని హరీష్ రావు ప్రశ్నించారు. 

కేటీఆర్‌ని అరెస్ట్ చేయిస్తానంటూ మీడియాకు లీకులు ఇవ్వడాన్ని హరీష్ రావు తప్పు పట్టారు. కేటీఆర్‌ హైదరాబాద్‌ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తే, ఆయనని అరెస్ట్ చేయిస్తానని బెదిరిస్తున్నారని, ఇది డైవర్షన్ పాలిటిక్స్ అంటూ హరీష్ రావు సిఎం రేవంత్‌ రెడ్డిపై విరుచుకు పడ్డారు. 


Related Post