ఈ నెల 20వ తేదీన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఈరోజు ముంబై బయలుదేరుతున్నారు. ఈరోజు ఉదయం 8గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి ముంబై చేరుకుంటారు.
అక్కడ ముందుగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ రాష్ట్ర ముఖ్యనేతలతో సమావేశమైన తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. తర్వాత మీడియా సమావేశంలో పాల్గొని విలేఖరులతో మాట్లాడుతారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం ముగించుకున్న తర్వాత శనివారం రాత్రి తిరిగి హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఈరోజు ఉదయం ఝార్ఖండ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి ఆ రాష్ట్ర రాజధాని రాంచికి బయలుదేరి వెళ్లారు. ఆయన ఆదివారం రాత్రికి హైదరాబాద్ తిరిగివస్తారు. ఝార్ఖండ్ ఎన్నికలు రెండు దశలలో ఈ నెల 13, 20 తేదీల జరుగబోతున్నాయి. ఈ నెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.