ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీకి కొత్త పాలక మండలిని ఏర్పాటు చేసింది. ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీవీ5 వ్యవస్థాపకుడు, ఛైర్మన్ బీఆర్ నాయుడుని టీటీడీ ఛైర్మన్‌గా నియమించింది.
తెలంగాణ రాష్ట్రం నుంచి ఈసారి ఐదుగురుని టీటీడీ పాలక మండలిలో సభ్యులుగా నియమించింది. వారు: సుచిత్ర ఎల్లా, అనుగోలు రంగశ్రీ, నన్నూరి నర్సిరెడ్డి, బూరగాపు ఆనందసాయి.
ఆంధ్రా నుంచి 11 మందికి, తమిళనాడు 2, కర్ణాటక 3, మహారాష్ట్ర 1, గుజరాత్ నుంచి ఒకరిని టీటీడీ పాలకమండలిలో సభ్యులుగా నియమించింది.
బీఆర్ నాయుడు నిన్న తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ, తాను తిరుపతిలోనే పుట్టి పెరిగానని కనుక తిరుమల గురించి తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. తిరుమలలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని, త్వరలోనే పాలక మండలి సమావేశం ఏర్పాటు చేసి అన్ని అంశాలపై చర్చించిన తర్వాత తగు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.
ముఖ్యంగా స్వామివారి ఆలయ నిర్వహణ, తిరుమలకి వచ్చే భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప ఈవిదంగా స్వామివారికి, భక్తులకు సేవ చేసుకొనే భాగ్యం లభించదని టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టబోతున్న అన్నారు.
తనను టీటీడీ ఛైర్మన్‌గా నియమించి ఈ భాగ్యం కల్పించినందుకు బీఆర్ నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లకు కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.