సిఎం రేవంత్ రెడ్డి అటు మూసీపై ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయాలతో ఇటు పాలనాపరమైన పనులతో క్షణం తీరికలేకుండా గడుపుతున్నారు. కనుక ఆయన సతీమణి, కుమార్తె, అల్లుడు మనుమడు, బంధువులతో కలిసి బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
తెల్లవారుజామున సుప్రభాత సేవ ముగిసిన తర్వాత వీఐపీ బ్రేక్ దర్శనంలో అందరూ స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు సిఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి సాదరంగా స్వాగతం పలికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు.
మరోపక్క హైదరాబాద్ సిఎం రేవంత్ రెడ్డి మూసీ అభివృద్ధి గురించి మాట్లాడుతూ “నేను 80 వేల పుస్తకాలు చదివిన మేధావిని కాను. కుర్చీ వేసుకొని కూర్చొని కాళేశ్వరం వంటి ప్రాజెక్టుని కట్టించగల తెలివితేటలూ నాకు లేవు. కనుక ఈ రంగంలో అనుభవం ఉన్న అంతర్జాతీయ సంస్థలకు ఈ బాధ్యత అప్పగించి, నా పరిధిలో నేను చేయాల్సిన పనులు మాత్రమే చేస్తున్నాను.
నేను ఏ పని మొదలుపెట్టాలన్నా ముందు చాలా లోతుగా ఆలోచిస్తాను. అవసరమైతే అందరి సలహాలు తీసుకుంటాను. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక ఇక మద్యలో ఆగే ప్రసక్తే ఉండదు. దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరంలో చుంగేచాన్ నదిని ఈవిదంగానే ప్రక్షాళన, సుందరీకరణ చేసి హాన్ రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేసిన తర్వాత ఆ నగరంలో అదే అతిపెద్ద పర్యాటక ఆకర్షణ కేంద్రంగా మారింది.
కేసీఆర్‌ని ఓడించాను. ముఖ్యమంత్రి అయ్యాను. నా జీవితానికి ఇంతకంటే ఏం కావాలి. అందుకే మూసీ నదిని అభివృద్ధి చేసి హైదరాబాద్ నగరానికి నావంతుగా తోడ్పడాలనుకుంటున్నాను,” అని అన్నారు.