సిఎం రేవంత్ రెడ్డి ఈరోజు సచివాలయంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెపుతూనే కేటీఆర్‌పై విరుచుకు పడ్డారు.
మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు (నవంబర్ 20న పోలింగ్, 23న ఫలితాలు)ముగిసిన తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానానికి తనకి మద్య గ్యాప్ వచ్చిందని బిఆర్ఎస్ పార్టీయే దుష్ప్రచారం చేస్తోందన్నారు. బిఆర్ఎస్ పార్టీ వద్ద భారీగా అక్రమ సంపాదన నిలువ ఉంది కనుక దానిని ఖర్చు చేసి మీడియాలో తనపై, తన ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయిస్తోందని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ఎవరైనా దీపావళి పండుగ అంటే టపాసులు కాల్చుకొని స్వీట్లు పంచుకుంటారు. కానీ జన్వాడలో కేటీఆర్ బావమరిది ఫామ్‌హౌస్‌లో ఖరీదైన విదేశీ మద్యం బాటిల్స్ దొరికితే గృహప్రవేశం ‘దావత్’ చేసుకుంటున్నామని కేటీఆర్ బుకాయిస్తున్నారు.
రాష్ట్రంలో కేసీఆర్ అధ్యాయం ముగిసిందని ఇక కేటీఆర్‌తో లెక్కలు తేల్చుకోవలసి ఉందన్నారు. రాజమౌళి, రాంగోపాల్ వర్మలకి ఎవరి స్టైల్ వారికి ఉన్నట్లే తనకు, కేటీఆర్‌కి కూడా వేర్వేరు విధానాలలో రాజకీయాలు చేస్తుంటామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
మూసీనది ప్రక్షాళన చేసి తీరుతామని వీలుచూసుకొని నేనే మూసీ ప్రాంతంలో పర్యటించి అక్కడ నివశిస్తున్న ప్రజలతో ముఖాముఖీ మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటానని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు.