ప్రముఖ తమిళ సినీ నటుడు విజయ్ ఆదివారం చెన్నైలో తన రాజకీయ పార్టీ విదివిధానాలను ప్రకటించారు. విల్లుపురం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వేలాదిగా అభిమానులు తరలివచ్చారు.
వారిని ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ, “నా సినీ కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు సినిమాలు విడిచిపెట్టి ప్రజల కోసం రాజకీయాలలోకి వచ్చాను. మన తమిళగ వెట్రి కళిగం పార్టీ (టివికెపి) మన ద్రవిడ, తమిళ సంస్కృతికి, లౌకికవాదానికి కట్టుబడి పనిచేస్తుంది.
మన మార్గదర్శకులు పెరియార్ ఈవీ రామస్వామి, కామరాజ్, వేలు నాచియార్, డా.అంబేడ్కర్, అంజలి అమ్మాళ్ తదితరుల స్పూర్తి, ఆశయాలతో ముందుకు సాగుతాము.
రాజకీయాలలో చేరేందుకు అనుభవం ముఖ్యం కాదు. ప్రజలకు సేవ చేయాలనే నిబద్దత ముఖ్యం. అది నాకు పుష్కలంగా ఉందని భావిస్తున్నాను. అందువల్ల అత్యంత సంక్లిష్టమైన రాజకీయాలలోకి వచ్చేందుకు నేను భయపడలేదు,” అని అన్నారు.
ఇతర పార్టీల పట్ల తమ పార్టీ వైఖరిని వివరిస్తూ, “బీజేపీ మత రాజకీయాలకు మనం దూరంగా ఉందాము. లౌకికవాదానికి, మన ద్రావిడ సంస్కృతిని గౌరవించే పార్టీలతో స్నేహం చేద్దాము. ఎవరితో స్నేహం చేసినా అధికారంలోకి వస్తే వారు కూడా భాగస్వామిగా ఉంటారు. డీఎంకె నిబద్దత కోల్పోయిన పార్టీగా భావిస్తున్నాను,” అని అన్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత అన్నా డీఎంకె పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిపోగా, కరుణానిధి వారసుడుగా స్టాలిన్ డీఎంకె పగ్గాలు చేపట్టి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఇప్పుడు తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ని ఉప ముఖ్యమంత్రిగా చేసి తన రాజకీయ వారసుడుగా ప్రకటించారు.
బహుశః వచ్చే ఎన్నికలలో డీఎంకె మళ్ళీ గెలిచి అధికారంలోకి వస్తే ఉదయనిధి స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. కనుక డీఎంకెకి యువనాయకత్వం సిద్దంగా ఉండగా, ఇప్పుడు యువకుడైన విజయ్ కూడా టివికె పార్టీతో వస్తున్నారు. కనుక వచ్చే ఎన్నికలలో ఈ రెండు పార్టీల మద్యనే ప్రధానంగా పోటీ ఉండవచ్చు.