మూడు నెలలు మూసీలో ఉంటా: కిషన్ రెడ్డి

October 26, 2024


img

సిఎం రేవంత్‌ రెడ్డి మూసీ ప్రక్షాళనని ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటే, బీజేపీ, బిఆర్ఎస్, మజ్లీస్‌ పార్టీలు అందివచ్చిన రాజకీయ అస్త్రంగా భావిస్తున్నాయి. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్ళు కూల్చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని మూడు పార్టీలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉన్నాయి. 

సిఎం రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ మూసీ ఈగలు, దోమలు, కంపు భరిస్తూ జీవిస్తున్నవారికి ఆ కష్టం ఏమిటో తెలుస్తుందని దమ్ముంటే మూడు నెలలు మూసీలో ఉండి చూపాలని సవాలు విసిరారు. 

శుక్రవారం ఇందిరాపార్కులో మూసీ నిర్వాసితుల కొరకు బీజేపీ అధ్వర్యంలో ధర్నా జరిగింది. దానిలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, “మీ సవాలుని నేను స్వీకరించి, మూసీలో మూడు నెలలు ఉంటాను. అప్పుడైనా అక్కడి పేదల ఇళ్ళు కూల్చడం మానుకుంటారా?

గతంలో కేసీఆర్‌ కూడా ఇదేవిదంగా ప్రవర్తించారు. ఇప్పుడు మీరు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలవుతోంది. కొత్తగా ఒక్క ఇల్లు నిర్మించలేదు కానీ పేద ప్రజల ఇళ్ళు కూల్చివేసి వారిని రోడ్డున పడేస్తున్నారు. ఇందుకేనా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది?

ఎన్నికలలో ప్రజలకు అనేక హామీలు గుప్పించి అధికారం చేజిక్కించుకున్నారు. కానీ మీ ఆరు గ్యారెంటీ పధకాలు ఇంకా ఎప్పుడు అమలుచేస్తారు? వాటిని అమలు చేయకుండా పేదల ఇళ్ళు కూల్చేస్తామంటే చూస్తూ ఊరుకోబోము. తప్పకుండా అడ్డుకుంటాం. మూసీని ప్రక్షాళన చేస్తామంటే మాకేమీ అభ్యంతరం లేదు కానీ అంత కంటే మూసీకి రీటెయినింగ్ వాల్ నిర్మిస్తే సరిపోతుంది కదా?” అని అన్నారు.


Related Post