తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఊపందుకుంది కానీ ఎస్సీ వర్గీకరణకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దానిని అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో మళ్ళీ ఆలస్యం అవుతోంది.
2011 జనభా లెక్కల ప్రాతిపదికన ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు ఏక సభ్య న్యాయ కమీషన్ ఏర్పాటు చేయాలని సిఎం రేవంత్ రెడ్డి గురువారం ఆదేశించారు. నేడే న్యాయ కమీషన్ ఏర్పాటుకాబోతోంది.
అది 60 రోజులలోగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. దానిని ప్రభుత్వం పరిశీలించి ఆమోదం తెలిపితే దాని ఆధారంగా టీజీపీఎస్‌ఎస్సీ ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేస్తుంది.
ఎస్సీ వర్గీకరణ ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయడం కాస్త జటిలమైనదే. దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఎవరైనా కోర్టుకి వెళిన్నట్లయితే ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీలో ఇంకా ఆలస్యమవుతుంది.
ఎస్సీ వర్గీకరణ అమలుచేస్తామని సిఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించినందున, దానిని వర్తింపజేయకుండా ఈలోగా ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేసినా సంబంధిత వర్గాల అభ్యర్ధులు కోర్టుని ఆశ్రయించే అవకాశం ఉంది.
కనుక వివాదాలు, కోర్టు కేసులకు తావు లేకుండా ముందే అన్ని జాగ్రత్తలు తీసుకునేందుకు ఏకసభ్య న్యాయ కమీషన్ ఏర్పాటు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. కనుక ఈ ప్రక్రియ అంతా పూర్తవడానికి కనీసం మూడు నెలలు లేదా అంతకంటే ఎక్కువ సమయమే పట్టవచ్చు.