రాష్ట్ర విభజన సమయంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా విభజించి రెండు రాష్ట్రాలకు కేటాయించారు. కానీ ఏపీకి కేటాయించబడిన కొందరు అధికారులు ట్రిబ్యూనల్‌ని ఆశ్రయించి నేటికీ తెలంగాణ ప్రభుత్వంలోనే పనిచేస్తున్నారు.
వారందరూ ఈ నెల 16లోగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం(డివోపిటి) ఆదేశించింది. వారిలో ఐదుగురు ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్ అధికారులున్నారు.
ఐఏఎస్ అధికారులు: ఆమ్రపాలి (జీహెచ్‌ఎంసీ మునిసిపల్ కమీషనర్‌గా); రోనాల్డ్ రాస్ (తెలంగాణ ఇంధన శాఖ కార్యదర్శి, ట్రాన్స్‌కో సీఎండీ); వాణీ ప్రసాద్ (యువజన, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శి); వాకాటి కరుణ (మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి); ప్రశాంతి (పర్యావరణం, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి).
ఐపీఎస్ అధికారులు: అంజనీ కుమార్ (ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమీషనర్); అభిషేక్ మహంతి (కరీంనగర్ పోలీస్ కమీషనర్‌గా); అభిలాష్ బిస్త్ (పోలీస్ అకాడమీ డీజీ).
వీరి అభ్యర్దనలను పునః పరిశీలించాలని హైకోర్టు ఆదేశం మేరకు కేంద్ర ప్రభుత్వం దీపక్ ఖండేఖర్ కమిటీని నియమించింది. కానీ అది కూడా ఆంధ్రా క్యాడర్‌కి చెందిన వారందరినీ ఆంధ్రాకి పంపించాలని సిఫార్సు చేయడంతో డివోపిటి ఈ 8 మందిని తక్షణం తెలంగాణ ప్రభుత్వం నుంచి రిలీవ్ అయ్యి ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
అదేవిదంగా ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ క్యాడర్‌కు చెందిన ముగ్గురు ఐఏఎస్ అధికారులు హరికిరణ్, సృజన, శివశంకర్‌లను ఈ నెల 16లోగా తెలంగాణ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.