మంత్రి కొండా సురేఖకి నాంపల్లి కోర్టు నోటీస్‌ జారీ

October 11, 2024


img

మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీస్‌ జారీ చేసి తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. ఆమెపై అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఆమెపై బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా నాంపల్లి కోర్టులో గురువారం కేసు దాఖలు చేశారు.

ఆమె తనపై అనుచితమైన, తప్పుడు వ్యాఖలు చేయడం వలన తన ప్రతిష్టకు భంగం కలిగిందని కనుక ఆమెపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌ కోరారు. కేటీఆర్‌ వేసిన పిటిషన్‌ని కూడా నాంపల్లి కోర్టు విచారణకి స్వీకరించింది. సోమవారం దానిపై విచారణ జరిపే అవకాశం ఉంది. 

ఓ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మంత్రి కొండా సురేఖ మెళ్ళో దండ వేసిన ఫోటోమీ బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మంత్రి కొండా సురేఖ దానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆవేశంలో కేటీఆర్‌ టాలీవుడ్‌లో హీరోయిన్ల జీవితాలతో ఆడుకునేవారని, ఆయన వేధింపులు భరించలేక పలువురు పెళ్ళిళ్ళు  చేసుకొని సినీ పరిశ్రమ విడిచిపెట్టి వెళ్ళిపోయారని ఆరోపించారు.

అక్కినేని నాగార్జున కుటుంబం సమంతని ఆయన వద్దకు వెళ్ళమని ఒత్తిడి చేయడంతో అందుకు ఇష్టపడని ఆమె నాగ చైతన్య నుంచి విడిపోయారని మంత్రి కొండా సురేఖ అన్నారు. 

తెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని నాగార్జునతో సహా చిరంజీవి, జూ.ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ తదితర పలువురు ప్రముఖులు ఆమె వ్యాఖ్యలని ఆక్షేపించారు. ఈ వ్యవహారంలోనే అక్కినేని నాగార్జున ఆమెపై వంద కోట్లకు పరువునష్టం దావా వేయగా, కేటీఆర్‌ కూడా మంత్రి కొండా సురేఖకి లీగల్ నోటీస్‌ పంపించి ఆమెపై నిన్న కేసు వేశారు.


Related Post