ప్రముఖ యాంకర్ శ్యామల ఏపీ శాసనసభ ఎన్నికల సమయంలో ఆమె పిఠాపురంలో పర్యటించి అక్కడి నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ఆమె ధైర్యానికి మెచ్చుకొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నియమించారు.
అప్పటి నుంచే టిడిపి, జనసేన మద్దతుదారులు సోషల్ మీడియాలో తనపై అసభ్యకరమైన పోస్టులు, కామెంట్స్ చేస్తూ వేధిస్తున్నారని శ్యామల చెప్పారు. ఆమె కూడా వారికి సోషల్ మీడియా ద్వారానే ఘాటుగా బదులిచ్చారు.
“నన్ను ట్రోల్ చేస్తూ మానసికంగా వేధిస్తే నేను భయపడి రాజకీయాలు విడిచిపెట్టి వెళ్ళిపోతానని అనుకుంటున్నారేమో. కానీ నేను అటువంటి వాటికి భయపడే ప్రసక్తే లేదు. ఇండస్ట్రీలో నాకు పని దొరక్కుండా చేసి నన్ను దెబ్బ తీశారు. పర్వాలేదు నేను తట్టుకొని పోరాడుతూనే ఉంటాను.
ఏపీలో మహిళలపై ఇంతగా వేధింపులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే టిడిపి కూటమి ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నేను వైసీపి తరపున ప్రశ్నిస్తున్నాను. ప్రభుత్వం తక్షణం స్పందించి ఇటువంటివారిపై చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను,” అని యాంకర్ శ్యామల అన్నారు.