తెలంగాణలో అనూహ్యమైన రాజకీయ పరిణామాలు మొదలయ్యాయి. మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే మళ్ళా రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డిని వెంటబెట్టుకొని ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుతో నిన్న ఉదయం హైదరాబాద్‌లో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. అలాగే బిఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టిడిపిలో చేరబోతున్నట్లు చెప్పారు. కానీ మల్లారెడ్డి మాత్రం తమ ఇంట్లో ఓ శుభకార్యక్రమానికి ఆహ్వానించేందుకు వెళ్ళి చంద్రబాబు నాయుడుని కలిశానని అన్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ బంగారి తెలంగాణ సాధన పేరుతో రాష్ట్రంలో కాంగ్రెస్, టిడిపిలను పూర్తిగా తుడిచిపెట్టేశారు. కానీ కాంగ్రెస్ మళ్ళీ పుంజుకొని రాష్ట్రంలో అధికారంలోకి రాగా, ఎన్నికలకు దూరంగా ఉండిపోయి దానికి టిడిపి సహకరించింది. ఇప్పుడు తెలంగాణలో టిడిపిని మళ్ళీ మాలోపేతం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
తీగల కృష్ణారెడ్డి మొదట టిడిపిలోనే ఉండేవారు. రాష్ట్ర విభజన తర్వాత అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఆయన బిఆర్ఎస్ పార్టీలో చేరారు కానీ కేసీఆర్ ఆయనకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు. అయినప్పటికీ కేసీఆర్‌పై నమ్మకంతో ఇంతకాలం బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితే అయోమయంగా ఉండటంతో తీగల కృష్ణా రెడ్డి మళ్ళీ టిడిపి గూటికి చేరుకోవాలనుకుంటున్నారు.
మల్లారెడ్డిపై ఆదాయపన్ను, ఈడీ కేసులు, భూకబ్జా కేసులు, అక్రమ కట్టడాలు వగైరా చాలానే ఉన్నాయి. కనుక అటు మోడీ వద్ద, ఇటు రేవంత్ రెడ్డి వద్ద పరపతి ఉన్న చంద్రబాబు నాయుడు పంచన చేరి ఈ సమస్యలన్నిటి నుంచి బయటపడవచ్చని అనుకుంటున్నట్లున్నారు. కానీ ఆయనను టిడిపిలో చేర్చుకుంటే, చంద్రబాబు నాయుడే మునిగిపోయే ప్రమాదం ఉంటుంది.