మంత్రి కొండా సురేఖపై అక్కినేని నాగార్జున క్రిమినల్ కేసుతో పాటు రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ వ్యవహారంలో సినీ పరిశ్రమలో అందరూ ఆయనకు మద్దతుగా మంత్రి కొండా సురేఖపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఇప్పటికే హైడ్రా కూల్చివేతలతో ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడీ కొత్త వివాదంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది. అయితే మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉండటంతో ప్రభుత్వంలో, పార్టీలో ఎవరూ ఆమెకు అండగా నిలబడేందుకు ముందుకు రావడం లేదు. కానీ ‘జనం కోసం’ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డిఆ బాధ్యత తీసుకున్నట్లున్నారు. ఆయన నాగార్జునపై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అక్కినేని నాగార్జున తుమ్మిడికుంట చెరువుని కబ్జా చేసి ‘ఎన్ కన్వెన్షన్’ నిర్మించారని, అంతేగాక అక్రమ నిర్మాణం కోసం అక్కడి పచ్చటి చెట్లను నరికించేసి, ఎన్ కన్వెన్షన్’ నుంచి వ్యర్ధాలను బయటకు వదిలేసి పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగించారని, కనుక ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరుతూ కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
కొన్ని వారాల క్రితమే హైడ్రా సిబ్బంది ఎన్ కన్వెన్షన్ని కూల్చేశారు. దాంతో నాగార్జున మళ్ళీ హైకోర్టుని ఆశ్రయించారు. ఇప్పుడు ఈ కేసు హైకోర్టులో ఉన్నందున మాదాపూర్ పోలీసులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదుని స్వీకరించిన న్యాయ సలహా తీసుకున్నాక కేసు నమోదు చేయవచ్చా లేదా చెపుతామని చెప్పి పంపేశారు.