ఎవరు అవునన్నా కాదన్నా సరైన గుర్తింపుకి నోచుకోని అచ్చమైన తెలంగాణ పండుగ బతుకమ్మకి మళ్ళీ సముచిత గౌరవం, గుర్తింపు, ప్రజాధరణ సాధించిపెట్టిన ఘనత బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితదే.
తెలంగాణ ఉద్యమాలలో రాష్ట్రంలో మహిళలను చైతన్య పరిచి వారిని కూడా భాగస్వాములుగా చేయడంలో బతుకమ్మ పండుగ ఎంతగానో తోడ్పడింది.
మనమందరం తెలంగాణ బిడ్డలం... మన సంస్కృతీ సాంప్రదాయాలను, మనమే గౌరవించుకోకపోతే మరెవరూ గౌరవిస్తారు?అంటూ కల్వకుంట్ల కవిత చెప్పిన మాటలు రాష్ట్రంలో ప్రతీ మహిళని ఆలోచింపజేశాయి.
అలా బతుకమ్మ పండుగ అందరిలో చైతన్యం రగిలించి తెలంగాణ పోరాట సాధనలో మహిళలను కూడా భాగస్వాములుగా మార్చారు. అందుకు నేడు ప్రతీ మహిళా గర్వపడేట్లు చేశారు.
ఆ తర్వాత పదేళ్ళ కేసీఆర్ పాలనలో బోనాలు, బతుకమ్మ తదితర తెలంగాణ పండుగలు పబ్బాలకు, తెలంగాణ కళలకు అపూర్వమైన ఆదరణ, గౌరవం లభించాయి.
యావత్ దేశమే కాక ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో బతుకమ్మ ఆడిపాడారు. తెలంగాణ సంస్కృతికి అదో స్వర్ణయుగం అని చెప్పుకోవచ్చు.
అయితే ఈ ఏడాది బతుకమ్మ వేడుకలలో కల్వకుంట్ల కవిత ఎక్కడా కనిపించలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సుమారు ఆరు నెలలు జైలులో గడపడంతో ఆమెను ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయని ఆమె సోదరుడు కేటీఆర్ స్వయంగా చెప్పారు. బహుశః అందువల్లే ఆమె ఈసారి బతుకమ్మ వేడుకలకు దూరంగా ఉండిపోయారేమో?
కానీ కేసీఆర్ రాజకీయాలకు, కల్వకుంట్ల కవిత బతుకమ్మ పండుగకు దూరంగా ఉండిపోవడం అనుమానాలు, అపోహలకు తావిస్తోంది. కనుక వారు మీడియా ముందుకు వచ్చి స్పష్టత ఇస్తే బాగుంటుంది కదా?