ఇప్పటి వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవలసివస్తోంది. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో జరిగిన అపచారానికి పాప పరిహారంగా 11 రోజులు దీక్ష చేసి మంగళవారం సాయంత్రం కాళి నడకన అలిపిరి మెట్ల మార్గంలో తిరుమల కొండపైకి చేరుకున్నారు. ఆయన ఇద్దరు కూతుర్లు ఆద్య, పొలెనా అంజన కొణిదెల కూడా తిరుమల చేరుకొని తండ్రితో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.
ముందుగా పవన్ కళ్యాణ్ మైనర్ అయిన తన కుమార్తె పొలెనా అంజన కొణిదెల తరపున డిక్లరేషన్ ఫారం మీద సంతకం చేయగా, ఆమె కూడా సంతకం చేసింది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో స్వామివారి దర్శనానికి రావడంతో టీటీడీ అధికారులు సాంప్రదాయం ప్రకారం ఆయనకు స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు.
పవన్ కళ్యాణ్ తొలిసారిగా తన ఇద్దరు కుమార్తెలతో తిరుమలకు రావడంతో భక్తులు వారిని చూసేందుకు ఎగబడ్డారు. పవన్ కళ్యాణ్ వారికి నమస్కరిస్తూ స్వామివారిని దర్శించుకొని మళ్ళీ గాయత్రీ నిలయం కాటేజీకి వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్, ఇద్దరు కూతుర్ల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.