హైడ్రాకి హైకోర్టు మొట్టికాయలు: ఛార్మినార్ కూడా కూల్చేస్తారా?

October 01, 2024


img

హైడ్రా దూకుడుపై హైకోర్టు తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసింది. అమీన్‌పూర్‌లో ఓ ఆస్పత్రి భవనాన్ని కూల్చివేసినందుకు దాని యజమానులు హైకోర్టులో పిటిషన్‌ వేయగా, న్యాయస్థానం హైడ్రా కమీషనర్‌ ఏవీ రంగనాధ్, అమీన్‌పూర్‌ తహసీల్ధార్ ఇద్దరికీ నోటీసులు పంపించి కోర్టుకి రప్పించి గట్టిగా మొట్టికాయలు వేసింది.

శని, ఆదివారం ప్రభుత్వోద్యోగులకు సెలవు దినం కదా ఆ రెండు రోజులలోనే మీ సిబ్బంది ఎందుకు పనిచేస్తున్నారో చెప్పాలని న్యాయమూర్తి నిలదీశారు. అక్రమ కట్టడాలైనా సరే శని,ఆదివారం రోజులలో కూల్చరాదని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా ఎందుకు ఆ రెండు రోజులలోనే కూల్చివేస్తున్నారని, మీ ఉద్దేశ్యం ఏమిటని ప్రశ్నించారు. 

కూల్చివేతలకు యంత్రాలు, సిబ్బంది కావాలని కోరడంతో తాము వాటిని సమకూర్చుతున్నామని ఏవీ రంగనాధ్ సమాధానం చెప్పగా హైకోర్టు న్యాయమూర్తి మండిపడ్డారు. అడిగిన ప్రశ్నకు డొంక తిరుగుడు లేకుండా నేరుగా సమాధానం చెప్పాలని హెచ్చరించారు.

ఒకవేళ హైకోర్టు, ఛార్మీనార్ కూల్చేసేందుకు యంత్రాలు, సిబ్బంది కావాలని అడిగితే అలాగే ఇచ్చేస్తారా? అని న్యాయమూర్తి నిలదీశారు. 

హైకోర్టు ఆదేశాలను, నియమ నిబంధనలను పట్టించుకోకుండా ఇకపై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కటినచర్యలు ఎదుర్కోవలసి ఉంటుందని న్యాయమూర్తి ఇద్దరినీ హెచ్చరించారు. 


Related Post