దివంగత ప్రధాని ఇందిరాగాంధీతోనే దేశ రాజకీయాలలో వారసత్వ రాజకీయాలు మొదలయ్యాయి. ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించిన తర్వాత ఎక్కడికక్కడ మళ్ళీ చిన్నచిన్న రాజ్యాలు, సంస్థానాలు ఏర్పడిన్నట్లు రాజకీయాలలో కుటుంబాలు, వారసత్వాలు పెరిగాయి. వాటికి ఎన్నికలలో గెలిచి, ప్రజాస్వామ్యమనే ఆమోదముద్ర వేయించుకొంటున్నారు కనుక ఎవరూ వేలెత్తి చూపడానికి లేదు.
అలాంటి వారసత్వ రాజకీయాలే తమిళనాడులో చాలా కాలంగా సాగుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడు ఎంకె స్టాలిన్ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి. ఆయన కుమారుడు ఉదయానిధి స్టాలిన్ నేడు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అంటే తమిళరాజకీయాలలో మూడో తరం ప్రవేశిస్తోందన్న మాట!
మంత్రివర్గ విస్తరణ ప్రతిపాదనకు తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి శుక్రవారం ఆమోదముద్ర వేశారు. కనుక ఆదివారం మధ్యాహ్నం ఉదయానిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అంటే యువరాజ పట్టాభిషేకం అనుకోవచ్చు.
దివంగత కరుణానిధితో పోలిస్తే ఆయన కుమారుడు ఎంకె స్టాలిన్ కాస్త మృధువుగానే రాజకీయాలు చేస్తారని చెప్పవచ్చు. కానీ నేడు యువరాజ పట్టాభిషేకం చేసుకోబోతున్న ఉదయానిధి స్టాలిన్‌లో అతివాద ధోరణి ఎక్కువగా కనిపిస్తుంటుంది.
కనుక డీఎంకే పార్టీ, తమిళనాడు ప్రజలు ఈ మూడో తరం నాయకుడిని ఎలా స్వీకరిస్తారో? ముఖ్యమంత్రి తనయుడిగానే ఆవేశం ప్రదర్శించే ఉదయానిధి స్టాలిన్ పట్టాభిషేకం తర్వాత ఇంకా రెచ్చిపోతారో లేక రాజకీయ పాఠాలు నేర్చుకొని వినయ విధేయతలతో మెసులుకుంటారో... భవిష్యత్‌లో తెలుస్తుంది.