సినీ నటుడు నాగార్జున పెద్ద చెరువులో కొంతమేర ఆక్రమించి నిర్మించిన ‘ఎన్ కన్వేషన్’ని కూల్చివేసినప్పుడు సామాన్య ప్రజలు సైతం హైడ్రాని ప్రశంశించారు. అయితే ఇప్పుడు హైడ్రా విశ్వరూపం చూశాక అందరూ బెంబేలెత్తిపోతున్నారు.
ఆదివారం వస్తే హైడ్రా సిబ్బంది ఎక్కడ జేసీబీలు వేసుకొని తమ ఇళ్ళ మీదకి వస్తారో అని నగర ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఓ పక్క హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నప్పటికీ హైడ్రా జోరు ఏమాత్రం తగ్గడం లేదు. బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల నేతలు బాధితులకు అండగా నిలబడి హైడ్రా తీరుని ప్రశ్నిస్తున్నారు.
క్రమంగా ఇది రాజకీయ రంగు పులుముకొంటుండటంతో హైడ్రా కమీషనర్‌గా ఏవీ రంగనాధ్ ఘాటుగా స్పందించారు. శనివారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “కొందరి కట్టడాలు కూల్చేసినప్పుడు మమ్మల్ని మెచ్చుకున్నవారే ఇప్పుడు విమర్శిస్తున్నారు.
అమీన్‌పూర్ వద్ద నిర్మించిన ఆస్పత్రిపై గతంలో కూల్చివేసిన మళ్ళీ నిర్మించారు. కనుక మేము ఆస్పత్రి యాజమాన్యానికి నోటీస్ ఇచ్చి, వారు పూర్తిగా ఖాళీ చేసిన తర్వాతే కూల్చివేశాము. అందుకు మా వద్ద వీడియో సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి.
కూకట్‌పల్లి నల్ల చెరువు ఆక్రమణలకు గురవడంతో ఆక్రమణలు తొలగించాము. అయితే పేద, మద్యతరగతి ప్రజల ఇళ్ళ జోలికి మేము వెళ్ళలేదు. ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకే హైడ్రాని ఏర్పాటు చేసినందున మేము మా బాధ్యత నిర్వర్తించక తప్పదు. కానీ దానిని తప్పు పడుతూ హైడ్రా గురించి సామాజిక మాద్యమాలలో కొందరు పనికట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు.
మేము రాజకీయ నాయకుల జోలికి వెళ్ళకుండా పేద, మద్యతరగతి ప్రజల ఇళ్ళను కూల్చివేస్తున్నామనే ఆరోపణలు సరికాదు. మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీల కాలేజీలకు మేము నోటీసులు ఇచ్చాము. అయితే విద్యాసంవత్సరం మద్యలో వారి కాలేజీ భవనాలు కూల్చివేస్తే విద్యార్దులు నష్టపోతారని మీము వారికి గడువు ఇచ్చాము తప్ప ఎవరి ఒత్తిళ్లకు లొంగికాదు.
గత కొన్ని దశాబ్ధాలుగా నగరంలో పలు చెరువులు, నాలాలు కబ్జాలకు గురయ్యాయి. కనుక వాటన్నిటినీ కబ్జాదారుల నుంచి విడిపించి ప్రభుత్వానికి అప్పగించాల్సిన బాధ్యత మాపై ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ధృడమైన నిర్ణయం తీసుకొని మాకు అండగా నిలబడుతోంది. కనుక ఇప్పుడు కాకపోతే మరెన్నటికీ అక్రమణలను తొలగించలేము. కనుక నగర ప్రజలందరూ మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాను,” అని రంగనాధ్ అన్నారు.