యాదాద్రి గోపురానికి బంగారు తాపటం పనులు త్వరలో...

September 28, 2024


img

కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ గోపురానికి బంగారు తాపటం చేయాలని సంకల్పించారు. దానికి భారీగా బంగారం, కోట్లాది రూపాయలు విరాళాలు కూడా సేకరించింది ప్రభుత్వం. అయితే ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో ఇంతకాలం ఆ పనులు మొదలవలేదు. 

శనివారం సచివాలయంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో యాదాద్రి ఆలయ గోపురానికి బంగారు తాపటం పనులు వీలైనంత త్వరగా మొదలుపెట్టాలని ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చిలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆలోగా బంగారం తాపటం పనులు పూర్తిచేయాలని అధికారులను మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. 

ఇటువంటి పనులు చేయడంలో మంచి అనుభవం ఉన్న స్మార్ట్ క్రియెషన్స్ అనే సంస్థకి ప్రభుత్వం ఈ బాధ్యత అప్పగించింది. ఈ పనులని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. దేవాదాయ శాఖ కార్యదర్శి శైలజా రామయ్యర్ ఛైర్ పర్సన్‌గా నలుగురు సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. 

ఈ సమావేశంలోనే భద్రాచలం శ్రీ సీతారామచండ్రుల ఆలయ అభివృద్ధి, విస్తరణ కోసం భూసేకరణ చేయాలని నిర్ణయించారు. ఈమేరకు దేవాదాయ శాఖ రెండు వేర్వేరు జీవోలు జారీ చేసింది. 


Related Post