హైడ్రా కూల్చివేతలతో నష్టపోతున్న ధనవంతులు ఎవరూ నోరువిప్పి బయటపడటం లేదు కానీ హైడ్రా దెబ్బకు రోడ్డున పడుతున్న నిరుపేదలు, మద్య తరగతి ప్రజలు, చిరు వ్యాపారులు మాత్రం నేరుగా సిఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, హైడ్రాని నిందిస్తున్నారు.
తాము బిఆర్ఎస్ పార్టీని కాదని రేవంత్ రెడ్డి మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఆయన హైడ్రాతో తమ ఇళ్ళు కూల్చివేసి రోడ్డున పడేస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే బాధితులను బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తదితరులు పరామర్శించి ఓదార్చి ధైర్యం చెపుతున్నారు. వారి తరపున ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నారు. బిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా హైడ్రా బాధితులకు అండగా నిలబడతారని హరీష్ రావు చెప్పారు.
గత కొన్ని రోజులుగా ప్రతీరోజూ హైడ్రా బాధితులు బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌కు వచ్చి బిఆర్ఎస్ పార్టీ నేతలకు తమ గోడు మొరపెట్టుకుంటున్నారు. ఈరోజు (శనివారం) కూడా అనేకమంది తెలంగాణ భవన్‌కు రాగా మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు.
ఇక నుంచి హైడ్రా పేదలు, మద్యతగరతి వారి ఇళ్ళు కూల్చేందుకు వస్తే హైడ్రా కంటే ముందు తామే అక్కడకు చేరుకొని అడ్డుకుంటామని హరీష్ రావు, సబితా రెడ్డి చెప్పారు. ఆదివారం నుంచి బిఆర్ఎస్ నేతల బృందం హైడ్రా కూల్చివేసిన ఇళ్ళవద్దకు వెళ్ళి బాధితులను పరామర్శించనున్నారు.
ఈ పరిణామాలను గమనిస్తే హైడ్రా కూల్చివేతలతో నగర ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం దూరం చేసుకోవడమే కాక వారు బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలవైపు మొగ్గు చూపేలా చేస్తోంది. హైడ్రాతో ఇప్పటికే అనేక మంది ఇళ్ళు కోల్పోయారు. వాటితోనే కాంగ్రెస్ పార్టీ వారి ఓట్లు కూడా కోల్పోయిందని చెప్పక తప్పదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో హైడ్రా ప్రభావం తప్పకుండా కనిపిస్తుంది.