ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతీశీ ఎంపిక

September 17, 2024


img

ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌ నేడు తన పదవికి రాజీనామా చేస్తుండటంతో, నేడు ఆమాద్మీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు సమావేశమయ్యారు. అర్వింద్ కేజ్రీవాల్‌ స్వయంగా పార్టీ సీనియర్ నాయకురాలు, మంత్రి అతీశీ మార్లెనా సింగ్‌ పేరుని ముఖ్యమంత్రిగా ప్రతిపాదించగా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమెకు మద్దతు తెలిపారు. 

ఈరోజు సాయంత్రం అర్వింద్ కేజ్రీవాల్‌ లెఫ్టినెంట్ గవర్నర్‌ని కలిసి తన రాజీనామా పత్రం సమర్పించి, అతీశీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు అనుమతించాల్సిందిగా కోరనున్నారు. బహుశః ఈరోజు సాయంత్రం లేదా రేపు అతిశీ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.

అర్వింద్ కేజ్రీవాల్‌ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయ్యి ఆరు నెలలు జైల్లో ఉన్నప్పుడు అతిశీయే పార్టీ, ప్రభుత్వం చెల్లాచెదురు అయిపోకుండా జాగ్రత్తగా కాపాడుకున్నారు. కనుక ముఖ్యమంత్రి పదవికి ఆమె సరైనవారని అర్వింద్ కేజ్రీవాల్‌ భావించారు. 

అతీశీ (43) ఆమాద్మీ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో సభ్యురాలుగా చాలా చురుకుగా వ్యవహరిస్తుంటారనే మంచి పేరుంది. అర్వింద్ కేజ్రీవాల్‌ ప్రభుత్వంలో విద్యాశాఖ, రోడ్లు భవనాల శాఖ, సాంస్కృతిక, పర్యాటక, మహిళా శిశు సంక్షేమ శాఖలను ఎంతో సమర్ధంగా నిర్వహిస్తూ మంచి సమర్ధురాలుగా నిరూపించుకున్నారు కూడా.


Related Post