తెలంగాణ పౌర సఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “తెల్ల రేషన్ కార్డులకు దరఖాస్తుల ప్రక్రియ అక్టోబర్ నుంచి ప్రారంభం అవుతుంది. చాలా మంది తెల్ల రేషన్ కార్డులును బియ్యం, వగైరాలకు కాక ఆరోగ్యశ్రీ కోసం ఉపయోగిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది.
కనుక తెల్ల రేషన్ కార్డులలో ఆ ఆప్షన్ తొలగించి ఆరోగ్యశ్రీ కొరకు వేరేగా కార్డులు జారీ చేస్తాము. వీటిలో అవకతవకలు నిరోధించడానికి ఈసారి రెంటినీ ‘స్మార్ట్ కార్డ్స్’గా మార్చి అందించబోతున్నాము. రేషన్ సరుకులు అవసరమైన వారికి తెల్ల రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ స్మార్ట్ హెల్త్ కార్డులు వేర్వేరుగా ఇస్తాము. ప్రస్తుతం రాష్ట్రంలో 89,21,907 తెల్ల రేషన్ కార్డులు, 2.81 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు.
తెల్ల రేషన్ కార్డులు జారీకి అనుసరించాల్సిన విడివిధానాలు రూపొందించడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన మంత్రుల ఉప సంఘం ఈనెల 21న మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకున్నాక అధికార ప్రకటన వెలువడుతుంది.