ఈరోజు తెల్లవారుజాము నుంచే హైదరాబాద్, హుస్సేన్ సాగర్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జనాలు ప్రారంభం అయ్యాయి. ముందు నుకున్న ప్రకారమే ఈరోజు ఉదయమే ఖైరతాబాద్ గణేశ్ విగ్రహం శోభాయత్ర కూడా ప్రారంభించారు. గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు స్వామివారికి హారతి ఇచ్చినా తర్వాత భారీ క్రేన్ సాయంతో ట్రాలీ మీదకు చేర్చారు.
ఈరోజు గణేశ్ నిమజ్జనాల సందర్భంగా సెలవు ప్రకటించడంతో తెల్లవారుజాము నుంచే వేలాదిమంది ప్రజలు ఖైరతాబాద్, హుస్సేన్ సాగర్ చేరుకుంటున్నారు. ‘గణపతి బప్పా మోరియా...’ అంటూ భక్తుల నినాదాల ఖైరతాబాద్ గణేశ్ శోభాయత్ర వైభవంగా సాగుతోంది.
ఖైరతాబాద్ నుంచి టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా మధ్యాహ్నం ఒంటిగంటకు హుస్సేన్ సాగర్ చేరుకుంటుంది. మధ్యాహ్నం 2.30 గంటల లోపు నిమజ్జన కార్యక్రమం పూర్తవుతుంది.
ఖైరతాబాద్ గణేశ్ తర్వాత హైదరాబాద్‌లో అంత ప్రసిద్ధి చెందిన బాలాపూర్ గణేశ్ శోభాయత్ర కూడా మరికొన్ని గంటలలో ప్రారంభం కాబోతోంది. ఆనవాయితీ ప్రకారం ముందుగా బాలాపూర్ గణేశ్ లడ్డూ ప్రసాదం వేలంపాట వేస్తారు. ఆ తర్వాత శోభాయత్ర మొదలవుతుంది.