హైదరాబాద్‌లో చెరువులు, ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా నిరోధించడానికి, కబ్జా అయిన వాటిలో నిర్మించిన అక్రమ కట్టడాలని కూల్చివేయడానికి రెండు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటక్షన్ ఏజన్సీ)ని ఏర్పాటు చేసింది. అది మంచి ఫలితాలు ఇస్తుండటంతో, ప్రభుత్వం దానికి చట్ట బద్దత కల్పించి మరింత శక్తివంతంగా తయారు చేయాలని నిర్ణయించింది. అందుకోసం ప్రభుత్వం తీసుకోబోతున్న చర్యలు:
• ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ వరకు మాత్రమే హైడ్రా పరిధి కలిగి ఉంది. దానిని హెచ్ఎండీఏ వరకు వ్యాపించాలని నిర్ణయించింది.
• నగరాన్ని నార్త్, సౌత్, సెంట్రల్ మూడు జోన్లుగా విభజించి ఆయా జోన్‌లకి ఎస్పీ స్థాయి ఐపీఎస్ అధికారులను ఇన్‌చార్జిగా నియమించాలని నిర్ణయించింది.
• మూడు జోన్లకు మూడు హైడ్రా (పోలీస్) స్టేషన్లు, వాటికి ప్రత్యేక సిబ్బంది, యంత్రాంగం అన్నిటినీ ఏర్పాటు చేయబోతోంది.
• సైబరాబాద్ పరిధిలో నార్త్ జోన్, రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలో సౌత్ జోన్, హైదరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో సెంట్రల్ జోన్ ఏర్పాటు కాబోతున్నాయి.
• ఈ మూడు జోన్లను హైడ్రా కమీషనర్ రంగనాథ్ పర్యవేక్షిస్తుంటారు.
• హైడ్రాకి చట్టబద్దత కల్పించేందుకు త్వరలో ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసి, వచ్చే శాసనసభ సమావేశాలలో బిల్లు పెట్టి ఆమోదింపజేస్తుంది.
• ఆక్రమణలను అరికట్టడానికి మునిసిపల్ చట్టంలో సవరణలు చేయబోతోంది.