కేసీఆర్‌కి మళ్ళీ కోర్టు నోటీస్‌ జారీ

September 06, 2024


img

తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్‌కి జయశంకర్ భూపాలపల్లి కోర్టు మళ్ళీ నోటీస్‌ పంపింది. ఆయన హయాంలో వేలకోట్లు ఖర్చు చేసి కట్టించిన మేడిగడ్డ బ్యారేజి పిల్లర్లు క్రుంగడంవలన బ్యారేజీలో నీటిని నిలువచేయలేని పరిస్థితి నెలకొందని, అందువల్ల ఆ బ్యారేజీపై చేసిన వేలకోట్ల ప్రజాధనం అంతా వృధా అయ్యిందని, దీనికి కేసీఆర్‌ బాధ్యత వహించలంటూ ఆ జిల్లాకు చెందిన రాజలింగమూర్తి అనే వ్యక్తి పిటిషన్‌ వేశారు. 

దానిని విచారణకు స్వీకరించిన జిల్లా కోర్టు, కేసీఆర్‌, మాజీ సాగునీటి శాఖమంత్రి హరీష్‌రావు, బ్యారేజీ నిర్మించిన ఎల్‌ అండ్‌ టీ ఎండీ సురేష్‌కుమార్‌, సబ్ కాంట్రాక్ట్ కంపెనీ మేఘ అధినేత కృష్ణారెడ్డి, రజత్‌కుమార్‌లకు నోటీసులు జారీ చేసి ఆగస్ట్ మొదటి వారంలో జరిగే విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. వారి తరపున వారి వారి న్యాయవాదులు హాజరై తమ వాదనలు వినిపించారు. 

కానీ జిల్లా కోర్టు ఈసారి కేసీఆర్‌, ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ ఇద్దరూ అక్టోబర్‌ 17న కోర్టు విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ నోటీసులు పంపింది. 

మరోపక్క కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ పీసి ఘోష్ కమీషన్‌ చేత విచారణ జరిపిస్తోంది. ఆయన ఈ ప్రాజెక్టులో పనిచేసిన అధికారులని పిలిపించుకొని ప్రశ్నించి వివరాలు రాబడుతున్నారు. వారందరూ కేసీఆర్‌ వైపే వేళ్ళు చూపుతున్నారు. 



Related Post