ఖమ్మంలో యుద్ధప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు

September 05, 2024


img

రాష్ట్రంలో వరదలతో తీవ్రంగా దెబ్బ తిన్న ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలను సిఎం రేవంత్‌ రెడ్డి స్వయంగా పరిశీలించి, సహాయ, పునరావాస, పారిశుధ్య పనుల కోసం వందల మంది మున్సిపల్, పంచాయతీ రాజ్‌, పోలీసులను పంపించారు.

దీని కోసం ఇరుగుపొరుగు జిల్లాల నుంచి సిబ్బందిని ఖమ్మంకి పంపించారు. ఈ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి ఐఏఎస్ అధికారి గౌతమ్‌ని నియమించడంతో ఆయన వెంటనే రంగంలో దిగి పూర్తిగా దెబ్బ తిన్న 15 కాలనీలలో సహాయ, పారిశుధ్య చర్యలను చేయిస్తున్నారు. 

ముందుగా పోలీసులు, విద్యుత్ సిబ్బందితో నెలకొరిగిన విద్యుత్ స్తంభాలను మళ్ళీ నిలబెట్టించి మళ్ళీ విద్యుత్ సరఫరా పునరుద్దరించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు.

వరదలతో 1,500 విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి, 350 ట్రాన్స్‌ఫార్మార్లు దెబ్బతిన్నాయి. వాటన్నిటినీ యుద్ధప్రాతిపదికన పునరుద్దరిస్తున్నారు. బుధవారం సాయంత్రానికి 85 గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్దరించామని, శుక్రవారంలోగా జిల్లాలో అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్దరిస్తామని ఏస్‌ఈ నరేష్ చెప్పారు.   

పారిశుధ్య కార్మికుకులు రోడ్లపై పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని ట్రాక్టర్లలోకి ఎక్కించి తొలగిస్తున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది నీళ్ళతో రోడ్లు, కాలువలు శుభ్రం చేస్తున్నారు. సుమారు వెయ్యి మందికి పైగా ఈ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. 

ఖమ్మం పోలీస్ కమీషనర్‌గా సునీల్ దత్ నేతృత్వంలో సీఐలు, ఎస్సైలు పర్యవేక్షణలో 525 మంది ట్రెయినీ పోలీస్ కానిస్టేబుల్స్ గ్రామ ప్రజల ఇళ్ళు శుభ్రపరిచి అన్నివిదాల తోడ్పడుతున్నారు. 

ప్రభుత్వం ఒకేసారి ఇంతమందిని రంగంలోకి దించి సహాయ, పునరావాస చర్యలు చేపడుతుండటంతో ఖమ్మం గ్రామీణ ప్రాంతాలు మళ్ళీ సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. 

ఒక్క ఖమ్మం జిల్లాలోనే 27 వైద్య బృందాలు ఎక్కడికక్కడ శిభిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నాయి. వాటిలో 5 బృందాలు ఇంటింటికీ వెళ్ళి ప్రజల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని అవసరమైన వారికి చికిత్స అందిస్తున్నాయి. ఐఏఎస్ అధికారి ఆర్‌వీ కర్ణన్ ఈ బృందాలని పర్యవేక్షిస్తున్నారు.



Related Post