నేడు 78వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ, “దేశాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఆనాడు తొలి ప్రధాని నెహ్రూ మొదలు కాంగ్రెస్ ప్రధానులు అందరూ ఎంతగానో కృషి చేశారు.
వారి అడుగుజాడలలోనే మా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నడుస్తూ వ్యవసాయానికి, రైతన్నలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఒకే విడతలో రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేయడమే ఇందుకు నిదర్శనం.
సాంకేతిక కారణాల వలన కొందరు రైతులకు ఈ సొమ్ము అందలేదు. వారి కోసం జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశాము.
పంట రుణాలు మాఫీ తర్వాత రైతు బంధు పధకం అమలుచేయబోతున్నాము. సన్నరకం బియ్యం సాగుని ప్రోత్సహిచేందుకు రూ.500 బోనస్ చెల్లిస్తాం.
ఇప్పటికే ఆరోగ్యశ్రీ, మహాలక్ష్మి పధకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీలను అమలుచేశాము. మిగిలిన హామీలన్నిటినీ కూడా తప్పకుండా అమలుచేస్తాం.
అంగన్వాడీలను ప్రీ-ప్రైమరీ పాఠశాలలుగా మార్చబోతున్నాము. రాష్ట్రంలో కొత్తగా ఇంటిగ్రేటడ్ మోడల్ స్కూల్స్ నిర్మించబోతున్నాము.
అలాగే యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పొందేందుకు వీలుగా స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి దానికి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రని ఛైర్మన్‌గా నియమించాము.
మా తాజా విదేశీ పర్యటనలో పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యి తెలంగాణకు పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టేందుకు ఒప్పించాము. గత ప్రభుత్వం విచ్చల విడిగా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఖర్చు పెట్టింది.
కానీ మా ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ నుంచి అతి తక్కువ వడ్డీకి అప్పు తెచ్చుకొని అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తుంది. మరో పదేళ్ళలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి దేశంలో మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.