కాంగ్రెస్ ప్రభుత్వం రేపు హైదరాబాద్‌లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించబోతోంది. ఆ కార్యక్రమానికి మాజీ సిఎం కేసీఆర్‌తో సహా పలువురు ప్రముఖులను ఆహ్వానించింది.
కానీ ఆ ఆహ్వానపత్రిక ముఖ్య అతిధిగా కే కేశవరావు పేరుని పైన ముద్రించి, దాని క్రింద మంత్రి కొండా సురేఖ (విశిష్ట అతిధి), మంత్రి దామోదర రాజనర్సింహ (గౌరవ అతిధి) అని పేర్కొంది. ఆ దిగువన వరుసగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లు ముద్రించి, వారిలో 9వ స్థానంలో కేసీఆర్, ఎమ్మెల్యే, గజ్వేల్ అని ముద్రించింది.
దీనిపై బిఆర్ఎస్ పార్టీ మండిపడుతూ, “సిగ్గు, సిగ్గు! దిగజారుడుతనంలో పరాకాష్టకు చేరుకున్న కాంగ్రెస్. తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ గారి పేరుని ఆహ్వాన పత్రికలో చివర్లో పెట్టి తమ కుంచిత స్వభావాన్ని మరొక్కసారి బయపెట్టుకున్న రేవంత్ సర్కార్. ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తూ.. మెదక్ జిల్లా స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికలో ఎంపీలు, ఎమ్మెల్సీల పేర్ల తర్వాత కేసీఆర్ పేరును చేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. దుష్ట కాంగ్రెస్ పార్టీ వింత చేష్టలు, విపరీత బుద్ధిని ప్రజలు గమనిస్తున్నారు.. సమయం వచ్చినప్పుడు తగురీతిలో జవాబు చెబుతారు,” అని ట్వీట్ చేసింది.
అయితే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడూ ప్రతిపక్ష నాయకులను గౌరవించకపొగా వారి పట్ల చాలా అవహేళనగా మాట్లాడుతుండేవారు. అప్పుడు వారితో అలా ప్రవర్తించి ఇప్పుడు గౌరవం ఆశిస్తే లభిస్తుందా?