హైదరాబాద్ పాతబస్తీలో మెట్రో కారిడార్ నిర్మించేందుకుగాను హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్ఎంఆర్ఎల్) సంస్థ భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. మెట్రో రెండో దశలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా మీదుగా చాంద్రాయణగుట్ట వరకు నిర్మించేందుకు ఇప్పటికే అలైన్మెంట్ ప్రక్రియ ముగిసింది.
దాని ప్రకారం ఆ మార్గంలో ఇళ్ళు, దుకాణాలు వగైరా కోల్పోయేవారు నేటి నుంచి 60 రోజులలోగా తమ అభ్యంతరాలను తెలియజేయాలని హెచ్ఎంఆర్ఎల్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. నిర్వాసితులు బేగంపేటలోని మెట్రో భవన్ కార్యాలయంలో అభ్యంతరాలను లిఖితపూర్వకంగా తెలియజేయవలసి ఉంటుంది.
అక్టోబర్ 7వ తేదీ ఉదయం 11 గంటల నుంచి స్పెషల్ కలెక్టర్ కూడా అందుబాటులో ఉంటారు. నిర్వాసితులు నేరుగా ఆయనను కలిసి తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చు.
ఈ కారిడార్‌లో శాలిబండ జంక్షన్ వరకు 33 దర్గాలు, 21 మసీదులు, 12 అఘర్ ఖానాలు, 12 హిందూ దేవాలయాలు, 7 శ్మశానవాటికలు, 6 చిల్లాలు కలిపి మొత్తం 103 నిర్మాణాలు ఉన్నాయి. కనుక వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు నష్టం కలుగకుండా మెట్రో కారిడార్ ఏర్పాటు చేసేందుకు అలైన్మెంట్ చేశారు. ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులకు నిబందనల ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తారు.