సుప్రీంకోర్టులో బిఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ

August 14, 2024


img

వరుసగా రెండు ఎన్నికలలో ఓడిపోయి ఢీలా పడిన బిఆర్ఎస్ పార్టీ ఇంకా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టుని ఆశ్రయించినా మధ్యంతర బెయిల్‌ లభించకపోగా రౌస్ అవెన్యూ కోర్టు ఆమె కస్టడీని సెప్టెంబర్‌ 2వరకు పొడిగించింది. 

ఈ నెల 20వ తేదీన సుప్రీంకోర్టులో సీబీఐ, ఈడీలు ఆమె బెయిల్‌ పిటిషన్‌పై తమ వాదనలు వినిపిస్తాయి. ఆ రెండు సంస్థలు ఆమెకు బెయిల్‌ వద్దనే వాదిస్తున్నాయి. కనుక ఈసారి బెయిల్‌పై అభ్యంతరం చెప్పకుండా ఉంటాయనుకోలేము. 

ఇక కల్వకుంట్ల కవిత కేసులో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉండగా తాజాగా గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీల నియామకం విషయంలో కూడా బిఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. 

బిఆర్ఎస్‌ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ ఇద్దరూ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందర్ రాజన్‌ తమ నియమకాలను పక్కన పెట్టి కాంగ్రెస్‌ ప్రభుత్వం సిఫార్సు మేరకు టీజెఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌, సియాసత్ పత్రిక ఎడిటర్ అమీర్ అలీ ఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియమించడాన్ని తప్పు పడుతూ వారు సుప్రీంకోర్టు వెళ్ళగా ఎదురు దెబ్బ తగిలింది. 

గవర్నర్‌, ప్రభుత్వానికి ఎమ్మెల్సీలను నియమించుకునే హక్కు, అధికారం ఉందని దానిలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. అయితే ఈ కేసులో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు నాలుగు వారాలు స్టే విధించి, ఈ కేసు తదుపరి విచారణని వాయిదా వేసింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా తెలంగాణ గవర్నర్‌ కార్యాలయానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.


Related Post