లోక్‌సభ ఎన్నికలలో సిఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన్నట్లుగా రేపు ఆగస్ట్ 15వ తేదీన మూడవ మరియు చివరి విడత పంట రుణాల మాఫీకి నిధులు విడుదల చేయనున్నారు.
ముందుగా రేపు ఉదయం గోల్కొండ కోట వద్ద జాతీయ జెండా ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడి నుంచే హెలికాఫ్టర్‌లో ఖమ్మం జిల్లాలోని వైరా చేరుకుని అక్కడ సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేస్తారు.
ఆ తర్వాత అక్కడే బహిరంగ సభలో చివరి విడత పంట రుణాల మాఫీకి నిధులు విడుదల చేస్తారు. జూలై 18న మొదటి దశలో లక్ష రూపాయల లోపు రుణాల మాఫీకి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.
ఆ తర్వాత లక్షన్నర లోపు రుణాలను జూలై నెలాఖరున మాఫీ చేసింది. ఇప్పుడు మూడో విడతలో రూ.2 లక్షల లోపు రుణాలను మాఫీ చేయబోతోంది.
మూడో విడతలో రుణమాఫీకి 32.50 లక్షల మంది అర్హులైన రైతులున్నట్లు వ్యవసాయ శాఖ గుర్తించింది. కానీ వారిలో 14.45 లక్షల మంది రైతులకు ముందుగా రుణమాఫీ సొమ్ము అందుతుంది. మిగిలినవారు తమ బ్యాంక్ ఖాతా, పట్టదార్ పాసు పుస్తకాలు, ఆధార్ వగైరా సమర్పించాల్సి ఉంది కనుక వారికి తర్వాత రుణమాఫీ జరుగుతుంది.