ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే. కనుక ఇప్పుడు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అదీ... ఓ అధికారి ఆయనపై ఫిర్యాదు చేయడం ఇంకా ఆశ్చర్యకరమే.
ఇంతకీ విషయం ఏమిటంటే, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్: 52లోని నందగిరిహిల్స్ హుడా లేఅవుట్ ఉంది. దానిని ఆక్రమణల బారి నుంచి కాపాడేందుకు హుడా దాని చుట్టూ కాంపుండ్ వాల్ నిర్మించింది.
అయితే మొన్న 10వ తేదీన ఎమ్మెల్యే దానం నాగేందర్ సమక్షంలోనే పక్కనే ఉన్న గురుబ్రహ్మ నగర్ బస్తీవాసులు ఆ గోడని కూల్చివేశారు. దానం నాగేందర్ ప్రోత్సాహంతోనే వారు ఆ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు ఆ గోడ కూల్చి వేశారని, దాని వలన హుడాకు రూ.10 లక్షలకు పైగా ఆస్తి నష్టం కలిగిందంటూ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన హైడ్రా ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారి వి పాపయ్య జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎమ్మెల్యే దానం నాగేందర్, బస్తీ నేతలు గోపాల్ నాయక్, రాంచందర్‌లపై కేసు నమోదు చేశారు. దీనిపై దానం నాగేందర్ ఇంకా స్పందించవలసి ఉంది. పది రోజుల వ్యవధిలో ఆయన వివాదంలో చిక్కుకోవడం ఇది రెండో సారి . శాసనసభ సమావేశాలలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశ్యించి అనుచితంగా మాట్లాడి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అందుకు దానం నాగేందర్ క్షమాపణలు చెప్పుకొని ఆ వివాదం నుంచి బయటపడగానే ఇప్పుడు ఈ వివాదంలో చిక్కుకున్నారు.