గురువారం దేశవ్యాప్తంగా అందరూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటారు కానీ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి మాత్రం ఇంకా స్వేచ్చ లభించలేదు. సుప్రీంకోర్టు ఆమెకు మద్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు కూడా అంగీకరించలేదు.
సోమవారం ఆమె బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాధన్‌ల ద్విసభ్య ధర్మాసనం ఆమె తరపు ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు విన్న తర్వాత సీబీఐ, ఈడీ వాదనలు విన్న తర్వాత బెయిల్‌పై తమ నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు.
అయితే ఆలోగా మద్యంతర బెయిల్ మంజూరు చేయాలని ముకుల్ రోహత్గీ విజ్ఞప్తి చేశారు. కానీ ధర్మాసనం తిరస్కరించింది. ఈ కేసు తదుపరి విచారణని ఆగస్ట్ 20వ తేదీకి వాయిదా వేస్తూ, సీబీఐ, ఈడీలను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ నోటీసులు పంపింది.
నిన్న జరిగిన విచారణలో ధర్మాసనం, ముకుల్ రోహత్గీ మద్య ఆసక్తికర వాదన జరిగింది. కల్వకుంట్ల కవిత మహిళ కనుక సెక్షన్ 45 కింద బెయిల్ పొందడానికి అర్హురాలని ముకుల్ రోహత్గీ వాదించగా, ఆమె మహిళ అని మాకూ తెలుసు. మేము కాదనడం లేదు. కానీ మీరు చెపుతున్నట్లు దుర్బల మహిళ కాదు. చాలా శక్తివంతమైన రాజకీయ నేపధ్యం కలిగిన మహిళ. కనుక ప్రతివాదులు (సీబీఐ, ఈడీ) వాదనలు వినకుండానే ఆమె మహిళ అనే కారణంతో బెయిల్ మంజూరు చేయలేము,” అని స్పష్టం చేశారు.
కనీసం మద్యంతర బెయిల్ మంజూరు చేయాలని ముకుల్ రోహత్గీ కోరగా దానినీ సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. కనుక ఆగస్ట్ 15వ తేదీన ఆమె తిహార్ జైల్లోనే ఉండక తప్పదు. ఆమెకు ఇంకా ఎప్పుడు స్వేచ్చ లభిస్తుందో?