తెలంగాణ యూనివర్సిటీలో స్టాన్‌ఫర్డ్ భాగస్వామ్యం

August 11, 2024


img

సిఎం రేవంత్‌ రెడ్డి బృందం అమెరికా పర్యటనలో శనివారం కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించారు. ఆ యూనివర్సిటీలో బయో డిజైన్ సెంటర్‌ ప్రతినిధులతో సమావేశమయినప్పుడు లైఫ్ సైన్సస్ రంగంలో తెలంగాణలో ఉన్న పరిశ్రమలు, ఆ రంగంలో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు.

ఆ రంగంలో యువత నైపుణ్యం మెరుగుపరుచుకునేందుకు స్కిల్ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీలో భాగస్వామిగా చేరి తోడ్పడాలని అభ్యర్ధించారు. తెలంగాణలో బయోడిజైన్ శాటిలైట్ సెంటర్‌ ఏర్పటు చేసేందుకు ప్రభుత్వం తరపున పూర్తి సహాయసహకారాలు అందిస్తామని సిఎం రేవంత్‌ రెడ్డి బృందం వారికి హామీ ఇచ్చింది.

దీనిపై సానుకూలంగా స్పందించిన బయో డిజైన్ సెంటర్‌ విభాగం అధిపతులు జోష్ మెకోవర్, అనురాగ్ మైరాల్ అప్పటికప్పుడు ఆసక్తి వ్యక్తీకరణ లేఖపై సంతకాలు చేసి ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని తాము కూడా గమనిస్తున్నామని, రాష్ట్రంలో మానవ వనరుల అభివృద్ధికి తాము తోడ్పడతామని వారు హామీ ఇచ్చారు. 

అమెరికాలో ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థ జోయిటీస్‌కి ఇప్పటికే హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సిఎం రేవంత్‌ రెడ్డి బృందంతో చర్చల అనంతరం హైదరాబాద్‌ తమ సంస్థ విస్తరణకు ఆ సంస్థ ప్రతినిధులు అనిల్ రాఘవ్, కీత్ సర్‌బాగ్ ఆమోదం తెలిపారు. తమ సంస్థ విస్తరణ ద్వారా కొన్ని వందల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని వారు చెప్పారు. వచ్చే నెలలోనే తమ సంస్థ విస్తరణ పనులు ప్రారంభిస్తామని వారు హామీ ఇచ్చారు. 


Related Post